Jagan Mohan Reddy: జగన్‌కు బిగ్ షాకిచ్చిన ఈడీ.. రూ.27.5 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బిగ్ షాకిచ్చింది.

Jagan Mohan Reddy: జగన్‌కు బిగ్ షాకిచ్చిన ఈడీ.. రూ.27.5 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

YS Jagan

Updated On : April 18, 2025 / 12:53 PM IST

Jagan Mohan Reddy: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బిగ్ షాకిచ్చింది. 14ఏళ్ల క్రితం నాటి మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డికి చెందిన రూ.27.5 కోట్ల విలువైన ఆస్తులను హైదరాబాద్ ఈడీ విభాగం తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఇందులో జగన్ రెడ్డికి చెందిన మూడు కంపెనీలైన కార్మెల్ ఆసియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, హర్ష సంస్థలకు చెందిన షేర్లు ఉన్నాయి.

 

జగన్ మోహన్ రెడ్డి ఆస్తులతోపాటు.. ఇదే కేసులో దాల్మియా సిమెంట్స్ (భారత్) లిమిటెడ్ (DCBL) యాజమాన్యంకు చెందిన రూ.377.2 కోట్ల విలువైన భూమిని కూడా కేంద్ర ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. అయితే, అటాచ్ చేసిన మొత్తం ఆస్తి విలువ రూ. 793.3 కోట్లు అని పేర్కొంది. 2011లో సీబీఐ కేసు నమోదు చేసింది. 2013లో చార్జిషీటు దాఖలు చేశారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఈ కేసులో ఈడీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసింది.

 

సీబీఐ, ఈడీ దర్యాప్తులో దాల్మియా సిమెంట్స్ యాజమాన్యం గతంలో జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన రఘురామ్‌ సిమెంట్స్‌లో రూ.95 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు తేలింది. దీనికి ప్రతిగా జగన్ మోహన్ రెడ్డి తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి కడప జిల్లాలో 407 హెక్టార్ల సున్నపురాయి గనుల లీజును దాల్మియా సిమెంట్స్ యాజమాన్యంకు ఇచ్చినట్లు సీబీఐ అభియోగం మోపింది. జగన్ రెడ్డి, ఆడిటర్, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిలు దాల్మియా సిమెంట్స్ యాజమాన్యంకు చెందిన పునీత్ దాల్మియాతో కలిసి రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్ లోని తమ వాటాలను ప్రెంచ్ కంపెనీకి రూ.135కోట్లకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని దర్యాప్తు బృందాలు ఆరోపించాయి.

 

ఇందులో రూ. 55 కోట్లు జగన్ రెడ్డికి 2010 మే16 నుంచి 2011 జూన్ 13 మధ్య హవాలా రూపంలో నగదు బదిలీ చేయడం జరిగిందని సీబీఐ అభియోగం మోపింది. ఈ నగదు లావాదేవీలను న్యూఢిల్లీలో అదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా గుర్తించారు. సీబీఐ ఛార్జ్ సీట్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.. తాజాగా.. రూ.973కోట్ల విలువైన ఆస్తులను అటాచ్చేసింది.