ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత..

ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత..

Jogi Ramesh : సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీమంత్రి జోగి రమేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. రేపు ధర్మాసనం ముందుకు వచ్చే అవకాశం ఉంది.

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు. ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడంతో జోగి రమేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జోగి రమేశ్ ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

కాగా తాను కేసులకు భయపడను అని జోగి రమేశ్ అన్నారు. చంద్రబాబు, లోకేశ్.. హామీలకు బదులు రెడ్ బుక్ అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Also Read : అప్పుడు బాబాయిని చంపి నెపం నెట్టారు.. ఇప్పుడు బోట్లతో విధ్వంసానికి వ్యూహం పన్నారు: సీఎం చంద్రబాబు

అటు టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు తమను అరెస్ట్ చేయకుండా తాత్కాలిక ఉపశమనం కల్పించాలని వారు దాఖలు చేసిన అప్పీల్ ను హైకోర్టు కొట్టేసింది. ఇదే కేసులో బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని ఇటీవలే న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

వైసీపీ నేతలను పలు కేసులు వెంటాడుతున్నాయి. అరెస్ట్ భయంతో కొందరు తప్పించుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఆఫీసు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో పలువురు వైసీపీ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేశ్, దేవినేని అవినాశ్, తలశిల రఘురాం కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.