Konaseema Fire : కోనసీమ జిల్లాలో అలజడి.. ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుంచి చెలరేగిన మంటలు
Konaseema Fire : పైప్ లైన్ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Konaseema Fire
Konaseema – ONGC Pipeline : కోనసీమ జిల్లాలో అలజడి చెలరేగింది. ఓఎన్ జీసీ పైప్ లైన్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. కేశనపల్లిలో జీసీఎస్ పైప్ లైన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకుని వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.. నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. దానికి తోడు తీవ్రమైన వేడితో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పైప్ లైన్ నుంచి మంటలు చెలరేగడంతో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి వ్యర్ధాలను బయటకు వదులుతారు. ఈ క్రమంలోనే ఓఎన్జీసీ అధికారులే సేఫ్టీ మెజర్స్ మధ్య మంట కూడా పెడతారు. అయితే, ఈసారి వ్యర్ధాలను మండిస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో పరిసర గ్రామాలు కేశవపాలెం, తూర్పుపాలెం ప్రాంత వాసులు మంటల వేడితో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తీవ్రమైన వేడి గాలులు, దట్టమైన పొగతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఊపిరి కూడా అందక అవస్థలు పడ్డారు.
చివరికి, 4 ఫైరింజన్లతో సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు అధికారులు. అసలే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల తీవ్రత అధికంగా ఉంది. మరోవైపు వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు పెద్ద ఎత్తున మంటలు చేలరేగడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.