చంద్రబాబు, లోకేశ్ ఫోటోలతో బీజేపీ నేత ఫ్లెక్సీ.. భగ్గుమన్న పరిటాల శ్రీరామ్ వర్గీయులు
గత ఎన్నికల్లో ఓటమి చెందగానే టీడీపీని వదిలి వెళ్లడమే కాక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డికి కప్పం చెల్లించారని ఆరోపించారు.

Flexi Fight In Dharmavaram
Gonuguntla Suryanarayana : కొత్త సంవత్సరం వేళ అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వెలిసిన ఓ ఫ్లెక్సీ పొలిటికల్ వార్ కు దారితీసింది. ఆ ఫ్లెక్సీ పంచాయితీ పరిటాల వర్సెస్ గోనుగుండ్లగా టర్న్ తీసుకుంది. బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ న్యూఇయర్ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదంతా బానే ఉంది. కానీ, ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ ఫోటోలు ఉన్నాయి. దీంతో పరిటాల శ్రీరామ్ వర్గం భగ్గుమంది.
బీజేపీలో ఉండి టీడీపీ నేతల ఫోటోలు ఎలా పెడతారు అంటూ పరిటాల వర్గీయులు ఆ ఫ్లెక్సీలను చించేశారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. పోలీసుల జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగింది. కానీ, ఇప్పుడా ఫ్లెక్సీ పంచాయితీ పొలిటికల్ వార్ గా మారింది.
Also Read : డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు..! సిక్కోలు వైసీపీలో హైటెన్షన్
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. టీడీపీ జనసేన పొత్తు ఉంటే బీజేపీ అభ్యర్థిగానే పోటీలో ఉంటారని తెలుస్తోంది. లేకపోతే టీడీపీలో చేరి సైకిల్ గుర్తుపై పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు ఫోటోలతో ఫ్లెక్సీ వేయించారు సూర్యనారాయణ.
ఇటు ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు పరిటాల శ్రీరామ్. గడిచిన ఐదేళ్లుగా శ్రీరామ్ నియోజకవర్గ ఇంఛార్జ్ గా పని చేస్తున్నారు. రాప్తాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా తల్లి పరిటాల సునీత, ధర్మవరం నుంచి తాను పోటీ చేయబోతున్నట్లుగా ఇప్పటికే శ్రీరామ్ ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో సూర్యనారాయణ పేరుతో ముదిగుబ్బ మండల కేంద్రంలో పెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిలో సూర్యనారాయణతో చంద్రబాబు, లోకేశ్ ఫోటోలు ఉన్నాయి. ఫ్లెక్సీలు చూడగానే మండిపోయిన పరిటాల శ్రీరామ్ మద్దతుదారులు వాటిని చించేశారు. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.
ధర్మవరం టీడీపీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ క్షమాపణలు చెప్పాలని పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చెందగానే సూర్యనారాయణ టీడీపీని వదిలి వెళ్లడమే కాక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డికి కప్పం చెల్లించారని ఆరోపించారు. ధర్మవరంలో సూర్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అక్రమార్జన ప్రారంభమైందని ధ్వజమెత్తారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి, కార్యకర్తలకు పరిటాల కుటుంబమే అండగా నిలిచిందని పరిటాల శ్రీరామ్ అన్నారు.
Also Read : తండ్రీ కొడుకుల మధ్య టికెట్ వార్.. అమలాపురం వైసీపీలో రసవత్తర రాజకీయం
సూర్యనారాయణ కూడా పరిటాల శ్రీరామ్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. పరిటాల శ్రీరామ్ భూ ఆక్రమణలను బయటపెట్టి తీరతామన్నారు. కార్యకర్తలను మోసం చేసి పరిటాల ఒక్కరే డెవలప్ అయ్యారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ.