Jyotula Nehru : ముద్రగడతో జ్యోతుల నెహ్రూ భేటీ.. రాజకీయంగా మద్దతు కోరానని వెల్లడి

జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఇరువురి మధ్య చర్చకు వచ్చిన అంశాలపై జ్యోతుల నెహ్రూ మీడియాకు వివరించారు.

Jyotula Nehru : ముద్రగడతో జ్యోతుల నెహ్రూ భేటీ.. రాజకీయంగా మద్దతు కోరానని వెల్లడి

Mudragada Padmanabha

Updated On : January 11, 2024 / 2:17 PM IST

Kapu Politics in AP : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కొద్ది రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీలు మారుతున్ననేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం టీడీపీ – జనసేన కూటమికి దగ్గరవుతున్నారా అనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వరుసగా జనసేన, టీడీపీకి చెందిన కాపు నేతలు ముద్రగడతో భేటీ అవుతున్నారు. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

Also Read : మా మొదటి ప్రయారిటి జగన్.. రెండో ప్రాధాన్యత చంద్రబాబు: మందకృష్ణ

ఇటీవల కాపులందరూ ఏకంకావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ లేఖలో రాసిన అంశాలను ప్రస్తావిస్తూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కు ఓ లేఖను రాసినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని, కాపు జాతి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ లేఖలో ముద్రగడ పేర్కొన్నట్లుగా తెలిసింది. అయితే, ఈ లేఖను విజయవాడలో పవన్ కు అందజేయనున్నారు. త్వరలో నాదెండ్ల మనోహర్, నాగబాబుసైతం ముద్రగడను కలవనున్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ ను కలిసేందుకు ముద్రగడ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Also Read : Kesineni Chinni: వాటితో చంద్రబాబుకు ఏం సంబంధం? కేశినేని నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేశినేని చిన్ని

ఇప్పటికే .. తాడేపల్లి గూడెం జనసేన ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్, అమలాపురంకు చెందిన కాపునేత తాతాజీ ముద్రగడతో భేటీ అయ్యారు. వీరంతా కలిసి గంటపాటు చర్చలు జరిపారు. ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనేదానిపై, ఎన్నికలకు జనసేన ఎలా సమాయత్తం అవుతుంది.. ముద్రగడ నుంచి ఎలాంటి సానుకూలత ఉందనే అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. మరోవైపు జ్యోతుల నెహ్రూసైతం ముద్రగడతో భేటీ అయ్యారు. వీరి మధ్య పలు రాజకీయ అంశాలపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే, భేటీ అనంతరం జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడారు. తమ ఊరిలో జరిగే కోటి శివలింగార్చన పూజలు చూసేందుకు ముద్రగడను ఆహ్వానించానని చెప్పారు. ఇందులో రాజకీయాలు ఏమీలేవని, రాజకీయంగా తనకు మద్దతు కావాలని మాత్రం కోరినట్లు తెలిపారు. ముద్రగడసైతం తప్పక చేస్తానని తనకు హామీ ఇచ్చారని, కేవలం తనకోసం మాత్రమే తాను వచ్చానని నెహ్రూ అన్నారు. తమ పార్టీ హైకమాండ్ తనను వెళ్లమని చెప్పలేదని జ్యోతుల నెహ్రూ తెలిపారు.