YSR Cheyutha Scheme : ఆధార్ కేంద్రాలకు జనాలు పరుగో పరుగు

సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న నిబంధన ఏపీ ప్రజలను రోడ్లపై నిలబెట్టింది. ఓ వైపు కర్ఫ్యూ అమలవుతుండటం.. మరోవైపు పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగుస్తుండటంతో మహిళలు ఆధార్‌ కేంద్రాల్లో బారులు తీరారు. రోజుల తరబడి తిరుగుతున్నా పని కావడంలేదని ఆవేదన చెందుతున్నారు.

YSR Cheyutha Scheme : ఆధార్ కేంద్రాలకు జనాలు పరుగో పరుగు

Aadhar

Updated On : June 5, 2021 / 10:59 AM IST

Aadhar Center Andhra Pradesh : సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న నిబంధన ఏపీ ప్రజలను రోడ్లపై నిలబెట్టింది. ఓ వైపు కర్ఫ్యూ అమలవుతుండటం.. మరోవైపు పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగుస్తుండటంతో మహిళలు ఆధార్‌ కేంద్రాల్లో బారులు తీరారు. రోజుల తరబడి తిరుగుతున్నా పని కావడంలేదని ఆవేదన చెందుతున్నారు.

వైఎస్సార్‌ చేయూత పథకం కింది లబ్ధి పొందేందుకు ఆధార్‌కు ఫోన్‌ నంబర్‌ లింక్‌ చేయడాన్ని తప్పనిసరి చేసింది ఏపీ ప్రభుత్వం. 45 ఏళ్లు నిండిన మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో 18 వేల 750 రూపాయలు జమ చేస్తోంది. దరఖాస్తు చేసుకొనే మహిళలు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరిగా ఉండాలి. అప్‌డేట్‌ హిస్టరీ ఆన్‌లైన్‌లో పొందాలంటే ముందుగా ఆధార్‌ కార్డు నెంబరుకు ఫోన్‌ నెంబరును లింక్‌ చేయాలి. ఈ ప్రక్రియ ఆధార్‌ నమోదు కేంద్రాల్లో మాత్రమే జరుగుతుండటంతో మహిళలు రోజుల తరబడి సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

ఆధార్‌కు ఫోన్‌ నెంబర్‌ను లింక్‌ చేయడం కోసం గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ పొద్దున్నే వచ్చి క్యూలో నిల్చున్నా తమ వంతు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండల్లో గంటలకొద్దీ నిలబడటంతో కొందరు సొమ్మసిల్లి పడిపోతున్నారు. జనం ఎక్కువగా గుమికూడటంతో ఎక్కడ కరోనా సోకుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు.

రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతుండటంతో మధ్యాహ్నం 12 గంటల వరకే ఆధార్‌ కేంద్రాలు పని చేస్తున్నాయి. దీంతో రోజుకు రెండు వందల మందికి మాత్రమే పని జరుగుతుంది. మిగతావారు మళ్లీ రావాల్సి వస్తోంది. ఇక గ్రామాల నుంచి వచ్చేవారికి ప్రయాణచార్జీలు తడిసిమోపడవుతున్నాయి. ప్రభుత్వం ఆధార్‌ కష్టాలకు చెక్‌ పెట్టాలని మహిళలు వేడుకుంటున్నారు. ఆధార్‌ కేంద్రాలను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదా కర్ఫ్యూ అమల్లో ఉన్నా ఆధార్ సెంటర్లు తెరిచేలా ఆదేశాలివ్వాలని కోరుతున్నారు.

Read More : World Environment Day 2021: ప్రకృతి కోసం.. ఈ ఏడాది “RRR” థీమ్‌తో పర్యావరణ దినోత్సవం