ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని టార్గెట్ చేసి వేధిస్తున్నారు- కూటమి ప్రభుత్వంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం

ఏ ప్రభుత్వం వచ్చినా వారి నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు పని చేస్తారు.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని టార్గెట్ చేసి వేధిస్తున్నారు- కూటమి ప్రభుత్వంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం

Gadikota Srikanth Reddy (Photo Credit : Google)

Gadikota Srikanth Reddy : కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. కూటమి ప్రభుత్వానికి శాడిస్టు లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఉద్యోగులను వ్యక్తిగతంగా వేధింపులకు గురిచేస్తూ మానసిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబే అధికారులని బహిరంగంగా అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. మా ప్రభుత్వంలో ఉద్యోగులను ఏనాడు అవమానకరంగా మాట్లాడలేదన్నారు శ్రీకాంత్ రెడ్డి.

”తనని తాను గొప్పగా చెప్పుకోవడానికి ఉద్యోగులను బెదిరిస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని టార్గెట్ చేసి వేధిస్తున్నారు. టీడీపీ హయాంలో కీలకంగా ఉన్న అధికారులకు మా ప్రభుత్వంలో కీలక పోస్టింగ్ లు ఇచ్చాం. ఏ ప్రభుత్వం వచ్చినా వారి నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు పని చేస్తారు. సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. ఇలా టార్గెట్ చెయ్యడం ఆరోగ్య పద్ధతి కాదు. అధికారులకు పార్టీల ముద్ర వెయ్యడం మంచి పద్దతి కాదు.

శ్రీ సిటీ తీసుకొచ్చింది వైఎస్ఆర్. నేనే తెచ్చానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. శ్రీ సిటీలో వైఎస్ జగన్ తీసుకొచ్చిన ప్రాజెక్టులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. జగన్.. ఐదేళ్లలో రాష్ట్రానికి పోర్టులు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ చేసిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు పాలనలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఎక్కడ చిత్తు కాగితాలు కాలిపోయినా ఏదో జరిగిపోయినట్లు హడావిడి చేస్తున్నారు. ప్రభుత్వం మీదే.. ఫైల్ కాలిపోతే నిర్లక్ష్యం మీదే కదా..? మూడు నెలలు అవుతుంది మీ కార్యాలయాలపై పట్టు లేదా..?” అని విరుచుకుపడ్డారు శ్రీకాంత్ రెడ్డి.

Also Read : చంద్రబాబుకి భారీ ఊరట.. ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు