Rayachoti Assembly Race Gurralu : వైసీపీ కోటను బద్దలు కొట్టే సామర్థ్యం టీడీపీకి ఉందా?

బలిజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల తరఫున అగ్రవర్ణాలకు చెందిన నేతలే పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

Rayachoti Assembly Race Gurralu : వైసీపీ కోటను బద్దలు కొట్టే సామర్థ్యం టీడీపీకి ఉందా?

Rayachoti Assembly Race Gurralu

రాయచోటి పేరు చెబితే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డే గుర్తుకువస్తారు. గడికోటకు కంచుకోటగా మారింది రాయచోటి. ముందు కాంగ్రెస్‌ నుంచి తర్వాత వైసీపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఈ హాట్‌సీట్‌లో ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది ప్రతిపక్ష టీడీపీ. వైసీపీలో శ్రీకాంత్‌రెడ్డే కింగ్‌.. ఆయనకు సరైన ప్రత్యర్థిగా మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డిని రంగంలోకి దింపింది టీడీపీ… రాజకీయ కుటుంబానికి చెందిన మండిపల్లి ఒక్కరికే వైసీపీ కోటను బద్దలు కొట్టే సామర్థ్యం ఉందని టీడీపీ భావిస్తోందట. మరి పసుపుదళం ఆశలు నెరవేరుతాయా? శ్రీకాంత్‌రెడ్డి కోటను టచ్‌ చేయడం అంత ఈజీనా…? అసలు రాయచోటి స్టోరీ ఏంటి?

గడికోట ఎంట్రీతో పూర్తిగా మారిన రాజకీయం..
ఒకప్పుడు కడప జిల్లా రాజకీయ సంచలనాలకు కేంద్రంగా ఉన్న రాయచోటి.. ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారింది. రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే రాయచోటి రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే.. 1955లో ఏర్పడిన రాయచోటి నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్‌ పార్టీయే గెలిచింది. టీడీపీ సీనియర్‌ నేత సుగవాసి పాలకొండ్రాయుడు హవాతో కాంగ్రెస్‌ వెనకబడినా.. 2009లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎంట్రీతో ఇక్కడ రాజకీయం మొత్తం మారిపోయింది.

జగన్‌కు అత్యంత సన్నిహితుడు..
తొలిసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా.. అసెంబ్లీలో సమర్థంగా తన వాణి వినిపించిన శ్రీకాంత్‌రెడ్డి.. వైఎస్‌ మరణం తర్వాత జగన్‌తోనే నడిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో ఉప ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వైసీపీలో కీలకనేతగా వ్యవహరిస్తున్నారు శ్రీకాంత్‌రెడ్డి. 2014, 2019 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు శ్రీకాంత్‌రెడ్డి.

యువకుడి చేతిలో ఓటమి..
రాయచోటి నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 31 వేల 637 ఓట్లు ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ 95 వేల పైచిలుకు ఓట్లు సాధించి విజయఢంకా మోగించింది వైసీపీ. 2004లో ఇక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పాలకొండ్రాయుడు.. 2009లో యువకుడైన శ్రీకాంత్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. వృద్ధాప్యం కారణంగా ఆయన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండటంతో పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్‌బాబు టీడీపీకి నాయకత్వం వహించారు. కానీ, శ్రీకాంత్‌రెడ్డిపై పట్టు సాధించలేకపోయారు. దీంతో రెడ్డప్పగారి రమేశ్‌రెడ్డిని తెరపైకి తెచ్చింది టీడీపీ. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఇవ్వకపోవడంతో ఇటీవలే వైసీపీలో చేరారు రమేశ్‌రెడ్డి.

పెరిగిన శ్రీకాంత్ రెడ్డి క్రేజ్..
ఇక్కడి నుంచి వైసీపీ తరఫున మళ్లీ గడికోట శ్రీకాంత్‌రెడ్డే పోటీ చేస్తున్నారు. అధిష్టానంలో పట్టుతోపాటు.. జగన్‌తో ఉన్న సానిహిత్యం వల్ల శ్రీకాంత్‌రెడ్డి జిల్లాలోనూ కీలకనేతగా ఎదిగారు. నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా మార్చడంతో శ్రీకాంత్‌రెడ్డి క్రేజ్‌ కూడా బాగా పెరిగింది. సీనియర్‌ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేశారు శ్రీకాంత్‌రెడ్డి. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో మరోమారు గెలవడం ఖాయమంటున్నారు శ్రీకాంత్‌రెడ్డి.

ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకున్న నేతలను కాదని కొత్త వ్యక్తికి టీడీపీ టికెట్..
వైసీపీకి కంచుకోటగా మారిన రాయచోటిలో ఈ సారి ఎలాగైనా గెలవాలనే టార్గెట్‌తో కొత్త నేతను తెరపైకి తెచ్చారు చంద్రబాబు. ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకున్న నేతలను కాదని.. మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని తెరపైకి తెచ్చారు. 2003 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న రామ్‌ప్రసాద్‌రెడ్డికి నియోజకవర్గంలో గట్టి పట్టు ఉందని చెబుతున్నారు. ఆయన తండ్రి నాగిరెడ్డి 1985, 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1994లో రామ్‌ప్రసాద్‌రెడ్డి సోదరుడు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన సోదరి శ్రీలతరెడ్డి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు.

మాజీ ముఖ్యమంత్రి మద్దతు..
ఇక రామ్‌ప్రసాద్‌రెడ్డి తల్లి సుశీలమ్మ చిన్నమండెం మండలం మండలాధ్యక్షురాలిగా పనిచేశారు. దీంతో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టడం ఒక్క రామ్‌ప్రసాద్‌రెడ్డికే సాధ్యమని నిర్ణయించి టికెట్‌ కట్టబెట్టారు చంద్రబాబు. ఈ మధ్యే పార్టీలోకి వచ్చిన మండిపల్లెకి టికెట్‌ ఇవ్వడం పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఐతే మాజీ సీఎం, రాజంపేట లోక్‌సభ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మద్దతు ఉండటంతో రామ్‌ప్రసాద్‌రెడ్డి వైపే మొగ్గు చూపింది టీడీపీ.

శ్రీకాంత్‌రెడ్డిపై గెలుపు అంత ఈజీ కాదు..
బలిజలు ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల తరఫున అగ్రవర్ణాలకు చెందిన నేతలే పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. జనసేనతో పొత్తు ఉండటం వల్ల బలిజ ఓట్లతో లబ్ధి పొందవచ్చునని భావిస్తోంది టీడీపీ. కానీ, నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా పాతుకుపోయిన శ్రీకాంత్‌రెడ్డిపై పైచేయి సాధించడం అంత సులువేమీ కాదనే విశ్లేషణలే ఎక్కువగా ఉన్నాయి. పైగా టీడీపీలో అంతర్గత విభేదాల వల్ల అంతిమంగా వైసీపీకే మేలు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయంలో ఇంకా మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో రాయచోటిపై ఎవరి జెండా ఎగురుతుందనే ఉత్కంఠ రోజురోజుకు ఎక్కువవుతోంది.

Also Read : ఢీ అంటే ఢీ అంటున్న పెద్దారెడ్లు.. కాక రేపుతున్న కావలి రాజకీయం