పంటికి పన్ను కంటికి కన్ను: టీడీపీ దాడులపై గోరంట్ల మాధవ్ స్పందన

మీరు 5 సంవత్సరాలు సంబరాలు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. మా కార్యకర్తల మీద, మా నాయకుల ఇళ్లపైనా దాడులు చేస్తున్నారు.

పంటికి పన్ను కంటికి కన్ను: టీడీపీ దాడులపై గోరంట్ల మాధవ్ స్పందన

Gorantla Madhav hot comments on TDP attacks in Andhra Pradesh

Updated On : June 6, 2024 / 3:44 PM IST

Gorantla Madhav: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా స్పందించారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ దాడులను సహించబోమని హెచ్చరించారు. గెలుపు ఉత్సాహంలో సంబరాలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని, దాడులకు పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని అన్నారు. టీడీపీ దాడులపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని, అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే తామేంటో చూపిస్తామన్నారు.

”ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడుతున్నారు. మీరు 5 సంవత్సరాలు సంబరాలు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. మా కార్యకర్తల మీద, మా నాయకుల ఇళ్లపైనా దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ప్రాణాలు అడ్డంవేసి ఇంకా బలోపేతం చేస్తాం. జరుగుతున్న దాడులపై మేము కూడా ఒక దశ వరకు చూసి.. నాగరికమైన పద్ధతుల్లోనే ఎస్పీలు, కలెక్టర్లు, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తాం. అప్పటికీ దాడులు ఆగకపోతే మా ఆత్మరక్షణ కోసం.. పంటికి పన్ను కంటికి కన్ను అనే నినాదంతో ముందుకు పోతాం.

Also Read: అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది: ప్రతిపక్ష నేతగా జగన్ ట్వీట్

తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులను చూసి జనంలో ఇప్పటికే విప్లవం రావడం మొదలైంది. ఇప్పటికైనా టీడీపీ నాయకులు తమ కార్యకర్తలు, అభిమానులను కంట్రోల్ చేయాలి. టీడీపీ దాడులకు గురైన మా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి భరోసా కల్పిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభద్రతాభావాలని లోనుకావొద్దని, మా కార్యకర్తలను రక్షించుకునే దమ్ము మాకుంది. కొత్తగా ఏర్పడబోయే ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, రైతుల కోసం పోరాడాలి. దీనికి మా మద్దతు ఇస్తాం. ప్రత్యేక హోదీ కోసం పార్లమెంట్ లో మా ఎంపీలు పోరాటం చేస్తారు. కొత్తగా ఎన్నికైన టీడీపీ నేతలు కొట్లాటల మీద కాకుండా రాష్ట్ర సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి. దౌర్జన్యాలు, దాడులకు ఆస్కారం ఇవ్వొద్ద”ని గోరంట్ల మాధవ్ అన్నారు.