చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రచారం బీజేపీకి భారీ ప్లస్ కాబోతుందా?
మహారాష్ట్ర ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కూడా ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Gossip Garage Chandrababu Pawan Kalyan Campaign (Photo Credit : Google)
Gossip Garage : NDAలో చంద్రబాబు, పవన్ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయ్. పొత్తులో ఉన్నాం.. సహకారం ఇచ్చి పుచ్చుకుందాం అన్నట్లుగా కూటమి పార్టీల తీరు కనిపిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు చంద్రబాబు, పవన్ రెడీ అయ్యారు. ఇంతకీ పవన్ మీద బీజేపీ పెట్టుకున్న ఆశలేంటి.. ఈ ఇద్దరి ప్రచారం బీజేపీకి భారీ ప్లస్ కాబోతుందా..
బీజేపీ కోసం మహారాష్ట్రకు చంద్రబాబు, పవన్..
బీజేపీని కలుపుకొని కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టాప్ లేపింది. అద్భుతమైన మెజారిటీతో సర్కార్ ఏర్పాటు చేసింది. పొత్తులో ఉన్న పార్టీలుగా.. ఒకరికి ఒకరం సహకారం అందించుకోవాలి అన్నట్లుగా.. బీజేపీ కోసం చంద్రబాబు, పవన్.. ఓవర్ టు మహారాష్ట్ర అంటున్నారు. జమిలి దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న వేళ.. మహారాష్ట్ర ఎన్నికలు కీలకంగా మారాయ్. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమికి మద్దతుగా చంద్రబాబు, పవన్ ప్రచార బాధ్యత తీసుకున్నారు. తెలుగు జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. ఈ ఇద్దరు ప్రచారం చేసేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.
మరట్వాడా, విదర్భ, పశ్చిమ రీజియన్లలో ప్రచారం..
మహారాష్ట్రలో రెండురోజుల పాటు.. 5 సభలు, 2 రోడ్‌షోలలో పాల్గొనబోతున్నారు పవన్. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో.. NDA అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. 16న నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొననున్న పవన్.. తర్వాత అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గంలో.. ఆ తర్వాత లాతూర్‌లో జరిగే మరో బహిరంగ సభలో పార్టిసిపేట్ చేస్తారు. అదే రోజు రాత్రి షోలాపూర్ సిటీలో రోడ్‌షోలో పాల్గొంటారు. 17న విదర్భ ప్రాంతానికి వెళ్లనున్న పవన్.. చంద్రపూర్ జిల్లాలోని బల్లార్‌పూర్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షోలో.. అక్కడి నుంచి కస్బాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటారు.
గతంలో కర్ణాటకలో బీజేపీ కోసం పవన్ ప్రచారం..
మహారాష్ట్రలో పవన్ పర్యటించే ప్రాంతాల్లో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్నారు. పైగా పవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో పవన్ సభలతో అక్కడ ఓట్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయని బీజేపీ అంచనా వేస్తోంది. గతంలో తెలంగాణలోనూ NDAకు అనుకూలంగా పవన్ ప్రచారం చేశారు. గతంలో కర్ణాటకలోనూ బీజేపీ కోసం పవన్ ప్రచారం నిర్వహించారు. ఇక సనాతన ధర్మ పరిరక్షణ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు.. తీసుకున్న చర్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయ్. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కూడా ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో.. నవంబర్ 20న ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయ్. కేంద్రం జమిలి నిర్ణయానికి.. మహారాష్ట్ర ఎన్నికలు కీలకం కాబోతున్నాయ్. దీంతో బీజేపీ.. ఈ ఎలక్షన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మిత్రపక్షాలను కూడా బరిలోకి దింపుతోంది.
Also Read : ఇవాళ అసెంబ్లీకి రాలేని పరిస్థితి వచ్చింది, ఇది దేవుడి స్క్రిప్ట్- జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్