Gossip Garage : చంద్రబాబు, జగన్, కేసీఆర్ బాటలో పవన్ కల్యాణ్.. ఏం చేస్తున్నారో తెలుసా..?
ఏపీలో పవన్‌కి సొంత నియోజకవర్గం ఏది అంటే..ఆయనకు కూడా అది బిగ్ క్వశ్చన్‌గా ఉండేది. కానీ ఇప్పుడు పవన్ కేరాఫ్ పిఠాపురం అయిపోయింది.

Gossip Garage : ఇంట గెలిచి రచ్చ గెలిస్తేనే గుర్తింపు. అది పర్సనల్ లైఫ్‌లో అయినా పాలిటిక్స్‌లో అయినా. పొలిటికల్ లీడర్ అయితే తన నియోజకవర్గంలో గెలిస్తేనే రాష్ట్ర స్థాయిలో పేరు ఉంటుంది. అందుకే పెద్ద నేతలందరూ..ముందుగా నియోజకవర్గాన్ని చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ప్రజలకు దగ్గరవుతూ..అభివృద్ధి పనులు చేస్తూ తమ ఇలాకాగా తీర్చిదిద్దుకుంటారు.
అందరి లీడర్లకు కంచుకోటలు ఉన్నట్లే..ఇక నుంచి పిఠాపురమే తన ఇలాకా అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. పిఠాపురం పేరెత్తితే చాలు తన పేరే గుర్తుకు వచ్చేలా ఇప్పటికే బ్రాండ్ క్రియేట్ చేసిన సేనాని..డెవలప్‌మెంట్ చేస్తున్నారు. పవన్‌కు పిఠాపురం నియోజకవర్గం పెట్టని కోటగా తయారవుతుందా? ఆ సెగ్మెంట్‌ను అడ్డాగా మార్చుకునేందుకు పవన్ చేస్తున్నదేంటి.?
పిఠాపురం నా కంచుకోట అంటున్న పవన్ కల్యాణ్..
రావడం ఆలస్యం కావొచ్చేమో కానీ..రావడం మాత్రం పక్కా. గెలిచింది మొదటిసారే అయినా..ఇక నుంచి పిఠాపురం తన కంచుకోట అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రాజకీయ నాయకుడు అన్నాక..ఆయనకో నియోజకవర్గం ఉంటుంది. తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాన్ని ప్రజాబలంతో పెట్టని కోటగా మార్చేసుకుంటారు. అప్పుడే ఆ నేతకు రాష్ట్రస్థాయిలో పేరు ఉంటుంది. పరిస్థితులు కలిసొస్తే అత్యున్నత స్థాయి పదవులు అనుభవించే అవకాశం దక్కుతుంది. అందుకే పిఠాపురంను పూర్తిగా తన ఇలాఖగా మార్చుకునే పనిలో పడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.
Also Read : అంత ప్రేమ ఉంటే జగన్ పంచన చేరండి.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం
ఏపీలోని 175 నియోజకవర్గాల్లో సమ్‌థింగ్ స్పెషల్ గా పిఠాపురం..
ఏపీలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే..పిఠాపురం సెగ్మెంట్ మరో ఎత్తు. పవన్ కల్యాణ్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి..డిప్యూటీ సీఎం హోదాలో ఉండటమే అందుకు కారణం. ఇప్పుటికే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేది స్టేటస్ అయిపోయింది. పవన్ అఖండ విజయం..ఆ నియోజకవర్గానికి ఓ బ్రాండ్‌ను తీసుకొచ్చింది. సేనాని గెలుపు..ఆ సెగ్మెంట్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చింది. అలా ఏపీలో 175 నియోజకవర్గాల్లో పిఠాపురం సమ్‌థింగ్ స్పెషల్ అయిపోయింది. ఇప్పడదే సెగ్మెంట్‌ను తన పొలిటికల్ అడ్డాగా..కంచుకోటగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో పడ్డారు పవన్.
ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా పిఠాపురం నుంచే ప్రారంభించాలని ఆదేశం..
ఏపీలో పవన్‌కి సొంత నియోజకవర్గం ఏది అంటే..ఆయనకు కూడా అది బిగ్ క్వశ్చన్‌గా ఉండేది. కానీ ఇప్పుడు పవన్ కేరాఫ్ పిఠాపురం అయిపోయింది. ఆయనకంటూ ఒక సొంత నియోజకవర్గం ఏర్పడింది. పవన్ కూడా తన మంత్రిత్వ శాఖలలో ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా పిఠాపురం నుంచే ప్రారంభించాలని ఆదేశిస్తున్నారు. అక్కడ సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. పవన్ అందుబాటులో ఉన్నా లేకున్నా నాగబాబు మాత్రం జన సైనికులకు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
పిఠాపురం రూపురేఖలు మార్చే ప్లాన్..
చంద్రబాబుకు కుప్పం..జగన్‌కు పులివెందుల..ఇప్పుడు లోకేశ్‌కు మంగళగిరి..పెట్టని కోటలుగా ఉన్నట్లుగానే..పిఠాపురంను తన ఇలాకాగా మార్చేసుకుంటున్నారు. పలువురు నేతలు తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా..తమ నిజయోజకవర్గంలో మాత్రం గెలుస్తూ వస్తుంటారు. అలాంటి వాళ్లలో చంద్రబాబు, జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తెలంగాణలో కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు. అలా తనకు కూడా ఓ నియోజకవర్గం కంచుకోటగా ఉండాలని..అది పిఠాపురమేనని భావిస్తున్నారు పవన్. ప్రజలకు దగ్గరవుతూ..ఎన్నికల్లో చెప్పినట్లుగానే పిఠాపురం నియోజకవర్గాన్ని..వేరే లెవల్‌కు తీసుకెళ్తున్నారు పవన్. ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తూ పిఠాపురం రూపురేఖలు మార్చే ప్లాన్ చేస్తున్నారు.
పిఠాపురం ఎమ్మెల్యేగా ఈ ఆరున్నర నెలల్లో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల లిస్ట్‌ను రిలీజ్ చేశారు పవన్. నియోజకవర్గ డెవలప్‌మెంట్ కోసం పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయించారు. అలాగే పిఠాపురంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాల కోసం రూ. 40 కోట్లకు ఆమోదం తెలిపారు. రూ.2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం మంజూరు చేశారు. గొల్లప్రోలులో తాగునీటి కోసం పైప్‌లైన్, మోటార్ల మరమ్మత్తుల కోసం రూ. 72 లక్షల విలువైన పనులు చేపట్టినట్లు పవన్ చెబుతున్నారు. ఇక ఏళ్లుగా సమస్యగా ఉన్న గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు మొదలు పెట్టారు.
పవన్ ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయి డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే తన రాజకీయం నిలబెట్టిన పిఠాపురంను డెవలప్ చేయడంతో పాటు..రాబోయే రోజుల్లోనే కంచుకోటగా మార్చుకునే పనిలో పడ్డారు. అక్కడి నుంచి ఎవరైనా పోటీ చేయాలంటే ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చేలా..అభివృద్ధి చేసి..ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నారు పవన్. చూడాలి మరి ఇంకా రాబోయే రోజుల్లో పిఠాపురం ఏ స్థాయిలో డెవలప్ అవుతుందో..
Also Read : తాడిపత్రి మహిళలే.. మహిళలా? మరి మిగిలిన వాళ్లు ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాధవీలత ఫైర్