CM Chandrababu: చేరికలపై వ్యూహం మార్చిన సీఎం చంద్రబాబు.. టైమ్‌ చూసి మరీ వైసీపీ నుంచి..

టీడీపీలో చేరాలనుకుంటున్న మిగతా నేతల ఆశలు కూడా చిగురిస్తున్నాయట.

CM Chandrababu: చేరికలపై వ్యూహం మార్చిన సీఎం చంద్రబాబు.. టైమ్‌ చూసి మరీ వైసీపీ నుంచి..

Chandrababu Naidu

Updated On : February 17, 2025 / 7:48 PM IST

ఇంతకు ముందు ఓ లెక్క. ఇక నుంచి మరో లెక్క. పార్టీ కేంద్ర కార్యాలయంలో డెసిషన్స్ ఉండవు. గ్రౌండ్‌ లెవల్‌లో నేతలు, కార్యకర్తల మనోగతమే ఫైనల్ అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నియోజకవర్గాల్లో నేతల అసంతృప్తుని, అభ్యంతరాలను వినీ మరీ..ఎదుటి పార్టీ నుంచి నేతలను ఎందుకు చేర్చుకుంటున్నామో చెప్పి ఒప్పించి కండువా కప్పుతున్నారు.

చేరికల సమయంలో కూడా ఎడమొఖం, పెడమొఖం అన్నట్లుగా కాకుండా.. ఏ నేత రాకనైతే పార్టీ నేతలు వ్యతిరేకించారో వాళ్ల సమక్షంలోనే జాయినింగ్స్ జరిగేలా చూస్తున్నారు సీఎం చంద్రబాబు. అలా అని పార్టీ కోసం శ్రమించిన, త్యాగం చేసిన నేతల మాటను కాదనటం లేదు. సొంత పార్టీ నేతలకు నచ్చజెప్పి, మెప్పించి..అపోజిషన్ పార్టీ నుంచి వచ్చే నేతలకు కండువా కప్పుతున్నారు. మాజీమంత్రి ఆళ్లనాని చేరిక ఇందుకు ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చంటున్నారు నేతలు.

సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆళ్లనాని నాలుగైదు నెలల కిందే టీడీపీలో చేరాల్సి ఉండే. కానీ ఏలూరు స్థానిక నేతలు వ్యతిరేకించడంతో ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆళ్లనాని సైకిల్ ఎక్కారు. ఆయన చేరిక కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు.

వ్యతిరేకించిన నేతలందరినీ ఒప్పించి..
వాస్తవానికి ఈ ఇద్దరు నేతలు ఆళ్లనాని చేరికను తీవ్రంగా అపోజ్‌ చేసినట్లు ప్రచారం జరిగింది. అందుకే మొన్నటి వరకు ఆళ్లనాని జాయినింగ్‌ను పెండింగ్‌లో పడుతూ వచ్చారు. ఫైనల్‌గా వ్యతిరేకించిన నేతలందరినీ ఒప్పించి..వాళ్ల సమక్షంలోనే ఆళ్లనానికి టీడీపీ కండువా కప్పారు సీఎం చంద్రబాబు. అంతేకాదు వల్లభనేని వంశీ అరెస్ట్ అంటూ హడావుడి నడుస్తున్న టైమ్‌లో..మూమెంట్‌ చూసి మరీ ఆళ్లనానిని చేర్చుకున్నారు.

ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ ఇప్పటికే ఖాళీ అయిందట. ఒకప్పుడు నానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నవారంతా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఎంఆర్డీ బలరాం దంపతులు, బొద్దాని శ్రీనివాస్‌తో పాటు మేయర్‌ నూర్జహాన్‌ పెదబాబు, కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే బడేటి చంటికి మద్దతుగా టీడీపీలో చేరారు.

వైసీపీ ఓడిన తర్వాత ఆళ్లనాని కూడా టీడీపీలో చేరాలని భావించగా నియోజకవర్గ టీడీపీ శ్రేణులు వ్యతిరేకించి నిరసనలు తెలిపారు. ఆళ్లనానిని పార్టీలో చేర్చుకోవడం స్థానిక ఎమ్మెల్యే చంటికి ఇష్టం లేక పోయినా అధిష్టానం బుజ్జగించి మరీ అంతా సెట్‌రైట్‌ చేశాకే చేర్చుకుంది. నానిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది.

మరొక ప్లాన్‌ ఇదే..
చేరికల వెనుక చంద్రబాబు మార్క్ వ్యూహం ఉందట. రెండు, మూడు రకాల వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీలో బలమైన నాయకులు లేకుండా చేయాలనే వ్యూహం ఒకటైతే.. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజనతో పెరగనున్న అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను సిద్ధం చేయడం మరొక ప్లాన్‌గా చెబుతున్నారు.

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో మరో 50 నియోజకవర్గాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అంటే 225 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను తయారు చేయాలన్న మాట. అందుకే సొంత పార్టీ నేతలు వ్యతిరేకించినా..బుజ్జగించి మరీ..వైసీపీ నేతలను చేర్చుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకొంత మంది నేతలను కూడా త్వరలోనే చేర్చుకుంటారని అంటున్నారు.

చంద్రబాబు వ్యూహం ఫలిస్తే వైసీపీకి, జగన్‌కు సవాళ్లు ఎదురవడం పక్కా అన్న చర్చ జరుగుతోంది. వైసీపీలో ఎవరికీ గట్టి పట్టు లేకుండా చేయడంతో పాటు, ఆ పార్టీని పూర్తిగా వీక్‌ చేసేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారని అంటున్నారు. వైసీపీని మరింత బలహీన పర్చడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని సిచ్యువేషన్‌ క్రియేట్‌ చేయాలని చంద్రబాబు వ్యూహమట.

అయితే ఆళ్లనాని జాయినింగ్‌తో.. టీడీపీలో చేరాలనుకుంటున్న మిగతా నేతల ఆశలు కూడా చిగురిస్తున్నాయట. తమ చేరికకు కూడా టీడీపీ అధిష్టానం త్వరలోనే గ్నీన్‌సిగ్నల్ ఇస్తుందని ఎదురు చూస్తున్నారట. రాబోయే రోజుల్లో ఇంకెవరెవరు నేతలు టీడీపీ గూటికి చేరుతారో చూడాలి మరి.