TDP Posts: 2 పదవులు.. రేసులో 10 మంది..! ఆ పోస్టులకు ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్ల పోటీ..

పార్టీ అధికారంలో లేనప్పుడు ఈ పదవులు అంత కీలకమేమి కాదు. కానీ ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండటం..పైగా ఉమ్మడి జిల్లాలో 14 చోట్ల కూటమి వారే గెలవడంతో..

TDP Posts: 2 పదవులు.. రేసులో 10 మంది..! ఆ పోస్టులకు ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్ల పోటీ..

Updated On : September 26, 2025 / 12:15 AM IST

TDP Posts: ఆ జిల్లాలో అధికార పార్టీలో ఏ పదవి ఇవ్వాలన్నా తలనొప్పిగా మారింది. ఇటు నామినేటెడ్ పదవులైనా..పార్టీ అధ్యక్ష పదవులైనా సరే అధిష్టానానికి ఒక ఛాలెంజింగ్‌గా మారుతోంది. ప్రస్తుతం రెండు జిల్లాల అధ్యక్షుల రేసు అధికార టీడీపీలో ఆసక్తి రేపుతోంది. సామాజిక వర్గాల ఈక్వేషన్లు, సీనియర్లు ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్నా..ఏకాభిప్రాయం రావడం లేదట. అసలు ఎందుకు అక్కడ అధ్యక్ష పదవులపై అంత గందరగోళం? అధిష్టానం మదిలో ఏముంది? రేసులో ఉన్న నేతలెవరు? పదవుల పంచాయతీ తేలేదెప్పుడు?

ఉమ్మడి అనంతపురం జిల్లా విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా..ఓవైపు అభ్యంతరాలు..ఇంకోవైపు హ్యాపీనెస్‌లు కామన్‌ అయిపోయాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు పార్లమెంటు ఇంచార్జీల నియామకం పెద్ద సమస్యగా మారింది. వాస్తవంగా ఇక్కడ రెండు జిల్లాలు ఉండటంతో రెండు జిల్లాల అధ్యక్షులు పదవులు చాలా కీలకంగా మారాయి. పార్టీ అధికారంలో లేనప్పుడు ఈ పదవులు అంత కీలకమేమి కాదు. కానీ ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండటం..పైగా ఉమ్మడి జిల్లాలో 14 చోట్ల కూటమి వారే గెలవడంతో అధ్యక్ష పదవి చాలా కీలకంగా మారింది.

ఓ విధంగా చెప్పాలంటే అది అనధికారికంగా ఒక మంత్రి పదవి ఉన్నట్టుగానే భావిస్తున్నారు. అందుకే ఈసారి అధ్యక్ష పదవి కోసం చాలా మంది రేసులో నిలుస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్ష పదవికి కొంత పోటీ తక్కువ ఉందని చెప్పాలి. పైగా అధిష్టానం కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రస్తుతం పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న అంజనప్ప ఇంకా ఒకరిద్దరు నాయకులు పోటీలో ఉన్నారు.

వీరిద్దరూ గడిచిన ఎన్నికల్లో టికెట్లు కూడా త్యాగం చేశారు..

అయితే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మధ్యనే పోటీ ఉంది. వీరిద్దరూ గడిచిన ఎన్నికల్లో టికెట్లు కూడా త్యాగం చేశారు. పల్లె రఘునాథ్ రెడ్డి కోడలికి టికెట్ ఇచ్చినప్పటికీ ఆయన సీనియారిటీకి తగ్గట్లుగా ఏదో ఒక పదవి ఇస్తామని గతంలోని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ హామీ నెరవేరలేదు. ఈ నేపథ్యంలో ఆయన అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు సమాచారం.

పల్లె రఘునాథరెడ్డి ఉమ్మడి జిల్లాలో అందరితోనూ సఖ్యతగా ఉంటారు. పైగా ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రభుత్వ చీఫ్ విప్ గా ఇలా అనేక పదవులు చూశారు. పదవికి తగ్గట్లుగా హుందాగా బిహేవ్ చేస్తారన్న పేరుంది. మరోవైపు తిప్పేస్వామి కూడా జిల్లాలో అందరు నేతలతో బాగుంటారు. గత ఎన్నికల్లో ఆయన ఎంపీ సీట్ కోసం ట్రై చేయగా సామాజికవర్గం ఈక్వేషన్లలో టికెట్ రాలేదు. ఇప్పుడు అధ్యక్ష పదవి కావాలని ఆయన అడుగుతున్నట్టు సమాచారం. వీరిద్దరిలో బీసీ సామాజిక వర్గమైతే తిప్పేస్వామికి, రెడ్డి సామాజిక వర్గం అయితే రఘునాథ్ రెడ్డికి పదవి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

అనంతపురం జిల్లా అధ్యక్ష పదవి విషయంలోనే చిక్కుముడి..

అనంతపురం జిల్లా అధ్యక్ష పదవి విషయంలోనే అసలైన చిక్కుముడి ఏర్పడింది. ఇక్కడ అధ్యక్ష పదవి కోసం చాలామంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో శింగనమల నియోజకవర్గానికి చెందిన నర్సానాయుడు, కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన గడ్డం సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ప్రస్తుతం పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న వెంకట శివుడు యాదవ్, శింగనమలకు చెందిన రామలింగారెడ్డి రేసులో ఉన్నారు.

ఇలా ఈ లిస్టు చోటా మోఠా నేతలతో కలిపి చాలా పెద్దగానే ఉంది. అనంతపురం జిల్లాలో మొత్తం ఏడు సెగ్మెంట్లలోనూ ఎవరికి వారే అన్నట్లుగా నడుచుకుంటున్నారు. ఇక్కడ అందర్నీ కలుపుకొని పోవడం అన్నది ఛాలెంజింగ్ విషయం. ఇలాంటి చోట అధ్యక్ష పదవి డీల్ చేయడం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలున్నాయి. పైగా సామాజిక వర్గ ఈక్వేషన్లు కూడా చాలా బలంగా ఉన్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకోవడంలో అధిష్టానం కాస్త తగబడుతున్నట్లే కనిపిస్తోంది.

ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వేలు, పార్టీలో అంతర్గత సర్వేలు, మరోవైపు నాయకుల అభిప్రాయాలు, ఎమ్మెల్యేల సిఫార్సులు ఇలాంటివి అన్ని అంశాలను కూడా అధిష్టానం పరిశీలించింది. కానీ ఇప్పటివరకు ఎవరికన్నది మాత్రం ఒక స్పష్టత రాలేదు. నర్సానాయుడు లేదా ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న వెంకట శివుడు యాదవ్‌కు జిల్లా అధ్యక్ష పదవి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధ్యక్ష పదవుల విషయంలో అధిష్టానం ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్న మాట. అయితే త్వరగా స్పష్టతనిస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో… పార్టీ బాధ్యతలు చూసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు లోకల్ లీడర్లు.

Also Read: టార్గెట్‌ వైసీపీ.. ఎథిక్స్ కమిటీ ఏం తేల్చబోతోంది? ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా? జగన్ సహా 11మంది రాజీనామా చేస్తారా?