సిక్కోలులో వైసీపీని కోలుకోలేని దెబ్బతీసేలా వ్యూహం సిద్ధం చేసిన టీడీపీ..!
వైసీపీలోని కీలక నేతల వ్యవహారశైలి పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారుతోంది. జిల్లా రాజకీయాలను శాసించిన కొందరు నేతలు వచ్చే ఎన్నికల నాటికి రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం..
Gossip Garage : సిక్కోలులో వైసీపీకి షాక్ తప్పదా? టీడీపీ వేట ఆగదా? అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీడీపీ… భవిష్యత్‌లోనూ ప్రత్యర్థి పార్టీ కోలుకోకుండా దెబ్బతీయాలనే వ్యూహాన్ని సిద్ధం చేస్తుందా? వైసీపీలో రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న నేతల వారసులను చేర్చుకుని… జిల్లాలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాలని చూస్తోందా? సిక్కోలు రాజకీయ చదరంగంలో చురుగ్గా పావులు కదుపుతున్నదెవరు? ఎవరికి చెక్ పడుతుంది? గేమ్‌ఛేంజర్‌గా నిలవాలని అనుకుంటున్నది ఎవరు?
వైసీపీ నేతల వారసులపై ఎందుకు దృష్టి పెట్టింది?
శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలోని కీలక నేతల వ్యవహారశైలి పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారుతోంది. జిల్లా రాజకీయాలను శాసించిన కొందరు నేతలు వచ్చే ఎన్నికల నాటికి రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం.. ఆ నేతల వారసులను టీడీపీలో చేర్చే దిశగా పావులు కదుపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో వాడివేడి చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాను క్లీన్‌స్వీప్ చేసిన టీడీపీ… వైసీపీ నేతల వారసులపై ఎందుకు దృష్టి పెట్టింది? టీడీపీయే ఈ ప్రతిపాదన తెచ్చిందా? వైసీపీ సీనియర్ నేతలే తమ వారసుల కోసం టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నారా? అనేది తేలాల్సివుంది.
వారసులకు రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనే ఆలోచన..
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూశారు. గత ఎన్నికల వరకు జిల్లా రాజకీయాలను శాసించిన ధర్మాన… తన పొలిటికల్ కెరీర్‌లోనే చవిచూడని విధంగా దాదాపు 50 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఎంతలా సర్వీస్ చేసినా, ప్రజలు ఘోరంగా ఓడించారనే ఆవేదనతో కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయారు ధర్మాన ప్రసాదరావు. ఇక మాజీ స్పీకర్ తమ్మినేని, మాజీ మంత్రి కృష్ణదాస్‌దీ ఇదే పరిస్థితి.
ఐతే ఈ ముగ్గురూ గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని.. తమ స్థానంలో వారసులను పోటీ చేయించాలని భావించారని ప్రచారం జరిగింది. కానీ, అధినేత జగన్ అంగీకరించకపోవడంతో ముగ్గరూ పోటీ చేయాల్సి వచ్చింది. ఇక వయసు రీత్యా ఈ ముగ్గురికీ వచ్చే ఎన్నికల నాటికి 70 ఏళ్లు దాటిపోతాయి. దీంతో తాము రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నప్పుడే వారసులకు రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని ఈ ముగ్గురూ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
వారసుల రాజకీయ జీవితంపైనే ఎక్కువగా ఫోకస్..
ధర్మాన సోదరులు వెలమ సామాజికవర్గ నేతలు కాగా, తమ్మినేని కళింగ సామాజిక వర్గ నేత. ఈ ముగ్గురు తమ సామాజివర్గంలో తిరుగులేని నేతలు. దీంతో వారు ఏ పార్టీలో ఉన్నా ఓ వెలుగు వెలిగారు. వైసీపీకి ముందు ధర్మాన సోదరులు కాంగ్రెస్‌లోనూ, తమ్మినేని టీడీపీ, ప్రజారాజ్యంలో పనిచేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీపై విరక్తి చూపుతున్న ఈ ముగ్గురు తమ వారసుల రాజకీయ జీవితంపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో జిల్లా టీడీపీ నేతలు ఈ ముగ్గురిలో ఒకరితో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సీనియర్ నేత వారసుడిని పార్టీలో చేర్చుకుని… వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కీలక పదవి ఇస్తామని… దీనికి ప్రతిగా జిల్లాలో ఆయన వర్గాన్ని మొత్తం టీడీపీలో చేర్చాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
జిల్లాలో వైసీపీ అడ్రస్ లేకుండా చేయాలనే టార్గెట్..
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి పెద్దదిక్కుగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూర రవికుమార్ ఉన్నారు. ఇక జిల్లాకు చెందిన మాజీ మంత్రి కళావెంకటరావు పక్క జిల్లా విజయనగరం రాజకీయాలకు తరలిపోయారు. దీంతో జిల్లా రాజకీయాలకు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లే చూసుకుంటున్నారు. ఇక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి జిల్లాలో వైసీపీ అడ్రస్ లేకుండా చేయాలనే టార్గెట్ పెట్టుకున్న టీడీపీ…. వైసీపీలో బడా నేత బిడ్డను పార్టీలో చేర్చుకునే ప్రతిపాదనపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
జిల్లాలో కీలక మున్సిపాలిటీలో ఆ నేతకు బలం ఉందంటున్నారు. ఇక 2029 ఎన్నికల నాటికి జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ఆ నేత గానీ, ఆయన వారసుడు గానీ పోటీ చేస్తామంటే టికెట్ ఇచ్చే అంశమూ పరిశీలిస్తామని హామీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. రాజకీయాలు వదిలేయాలనుకుంటున్న స్టేజ్‌లో టీడీపీ నుంచి ప్రతిపాదన రావడంతో ఆ నేత కూడా అనుచరులతో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.
పార్టీలో చేరికకు ఆ నేతకు టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవముందో కానీ, అదే జరిగితే వైసీపీకి షాక్ తప్పదని అంటున్నారు. ఇప్పటికే బలంగా ఉన్న టీడీపీకి.. వైసీపీలోని ఆ సీనియర్ నేత జత కలిస్తే ఇక ఎదురే ఉండదనే టాక్ వినిపిస్తోంది. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనకు టీడీపీ హైకమాండ్ ఆమోదిస్తుందా? లేదా? అనేదే ప్రశ్నార్థకంగా మారింది.
Also Read : సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు..! కేతిరెడ్డిలో సడెన్‌గా ఎందుకింత మార్పు, ఆ పార్టీలో చేరతారా?