Gossip Garage: త్వరలోనే కీలక వ్యక్తులు అరెస్ట్? తిరుమల కల్తీ నెయ్యి కేసులో అనూహ్య పరిణామం..
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో చక్రం తిప్పిన అప్పన్నకు..కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారట.

Gossip Garage: ఆరు నెలల కింద ఆ ఇష్యూ ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేసింది. నేషనల్ టాపిక్ అయింది. ఎంత కాంట్రవర్సీ అయిందో..అంతే స్థాయిలో ఒక్కసారిగా చల్లబడింది తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ఇష్యూ. స్పెషల్ సిట్ దర్యాప్తులో కీలక అప్డేట్స్‌తో ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది కల్తీ నెయ్యి కేసు. ఓ కీలక నేత పీఏను సిట్ విచారించడం, మరికొందరిని క్వశ్చన్ చేయడం కీలక పరిణామంగా మారింది. కల్తీ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది.? ఆ ఇద్దరికి నోటీసులు ఇవ్వబోతున్నారా.?
తీవ్ర దుమారం లేపిన తిరుమల లడ్డూ ఇష్యూపై స్పెషల్ సిట్ టీమ్ దర్యాప్తును స్పీడప్ చేసింది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సోదాల ఎపిసోడ్ అల్మోస్ట్ కంప్లీట్ చేసింది. ఇప్పుడు విచారణల ఎపిసోడ్ స్పీడప్ అయింది. ఓ రకంగా ఎంక్వైరీ కూడా క్లైమాక్స్‌కు చేరుకున్నట్లే కనిపిస్తోంది. టీమ్‌లుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్న అధికారులు..ఇప్పటికే నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌ను పరిశీలించారు. నెయ్యి సరఫరా చేసిన సంస్థలే లక్ష్యంగా పలువురిని ప్రశ్నించడంతో పాటు అన్ని లింకులపై ఆరా తీశారు.
టీటీడీ మాజీ ఛైర్మన్ పీఏకి నోటీసులు..
ఇప్పుడు లేటెస్ట్‌గా టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సిట్ నోటీసులు ఇచ్చింది. మూడు రోజులుగా ఆయన్ను స్పెషల్ సిట్ టీమ్ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పన్నతో పాటు మరో ఆరుగురు టీటీడీ ఉద్యోగులను కూడా సిట్ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో టీటీడీకి నెయ్యి సప్లై చేసిన డెయిరీ యజమానులు, ఉద్యోగులు ఉన్నారు.
నకిలీ నెయ్యి కేసుకు సంబంధించి 2025 ఫిబ్రవరిలో నలుగురు వ్యక్తులను స్పెషల్ సిట్ అరెస్ట్ చేసింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్, ఉత్తరాఖండ్‌లోని భోలే బాబా డెయిరీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు, శ్రీకాళహస్తికి చెందిన వైష్ణవి డెయిరీకి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ అరెస్టయిన వారిలో ఉన్నారు. వీళ్లు నకిలీ పత్రాలు సృష్టించి, టీటీడీ టెండరింగ్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందంటున్నారు. కేవలం అరెస్టయిన నిందితులకే పరిమితం కాకుండా, టీటీడీలోని కొందరు వ్యక్తుల ప్రమేయంపైనా సిట్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: వైసీపీకి తొందర ఎక్కువైందా? నిరసనలకు ఇది సరైన టైమ్ కాదా?
ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా వారికి కాంట్రాక్టులు..!
నెయ్యి సప్లై చేసిన సంస్థలకు ఆ స్థాయి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా..కొందరు టీటీడీ అధికారులు వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారని అనుమానిస్తున్నారు. ఈ కేసులోని ప్రధాన నిందితుల్లో ఇద్దరైన పోమిల్ జైన్, అపూర్వ చావ్డాలను సిట్ తిరిగి కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ విచారణ ద్వారా ఉన్నతాధికారుల ప్రమేయంపై మరింత స్పష్టత వచ్చిందంటున్నారు.
ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు అంతా ఒక ఎత్తు అయితే..అసలు ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయిందన్న డిస్కషన్ జరుగుతోంది. కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచడంతో కీలక వ్యక్తుల అరెస్ట్ ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే డెయిరీ యజమానులు, నెయ్యి సప్లయ్ దారులను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు..అసలు సూత్రధారుల పాత్రపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్‌గా టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు నోటీసులు ఇవ్వడం, ఆయన్ను విచారించడం హాట్ టాపిక్‌గా మారింది.
త్వరలోనే కీలక వ్యక్తుల అరెస్ట్?
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో చక్రం తిప్పిన అప్పన్నకు..కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారట. అందుకే అలిపిరిలోని సిట్ ఆఫీస్‌కు పిలిపించి అప్పన్నను విచారించినట్లు తెలుస్తోంది. త్వరలో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక చార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్..త్వరలోనే కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి మరో చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
వైవీ సుబ్బారెడ్డితో పాటు అప్పటి ఈవో ధర్మారెడ్డిని విచారిస్తే కల్తీ నెయ్యి ఇష్యూలో కన్ఫ్యూజన్ అంతా వీడుతుందని సిట్ ఓ అంచనాకు వచ్చిందట. ఇప్పుడు సుబ్బారెడ్డి పీఏను విచారించడం అందులో భాగమేనని..త్వరలోనే అసలు సూత్రధారులుగా భావిస్తున్నవారికి నోటీసులు ఇస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం..రాబోయే రోజుల్లో ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.