విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఎంపిక వెనుక జగన్‌ మాస్టర్ ప్లాన్ ఇదే..!

అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకోవాలంటే విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని పావులు కదుపుతున్న వైసీపీ... అన్నిరకాల లెక్కలు తీసివేతలు... వడబోతలు అనంతరం బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఎంపిక వెనుక జగన్‌ మాస్టర్ ప్లాన్ ఇదే..!

Gossip Garage : విశాఖ ఎమ్మెల్సీ యుద్ధానికి వైసీపీ సిద్ధమైంది. సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోడానికి సీనియర్‌ నేత బొత్సను బరిలోకి దింపుతోంది ఆ పార్టీ. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ద్వారా కూటమి ప్రభుత్వానికి తొలి సవాల్‌ విసరాలని భావిస్తోన్న వైసీపీ.. సమర్థుడైన అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సను రంగంలోకి దింపనుందంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స మాత్రమే గెలుపు గుర్రంగా భావిస్తున్న వైసీపీ… కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్లగలదా? స్థానిక సంస్థల్లో మెజార్టీ ఉన్నప్పటికీ… ప్రతికూల సమయంలో విజయబావుటా ఎగరేసేందుకు వైసీపీ అనుసరిస్తున్న వ్యూహమేంటి?

విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే పంతం..
విశాఖ స్థానిక సంస్థల ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30న జరిగే ఎన్నికకు 6వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. వైసీపీ సిట్టింగ్‌ స్థానమైన విశాఖను కాపాడుకోడానికి ఆ పార్టీ చాలా వేగంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. అధికార పక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో నామినేషన్ల ప్రకియ్రకు ఇంకా వారం రోజుల సమయం ఉండగానే తన అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సను ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స మాత్రమే నెగ్గుకురాగలరనే అంచనా వేస్తున్న వైసీపీ…. విశాఖలో గెలిచి నిలవాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకోవాలంటే విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని పావులు కదుపుతున్న వైసీపీ… అన్నిరకాల లెక్కలు తీసివేతలు… వడబోతలు అనంతరం బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

వ్యూహాత్మకంగా బొత్సను ఎంపిక చేసిన జగన్..
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. మొత్తం 841 ఓట్లకు గాను వైసీపీకి 75 శాతం బలం ఉండగా, అధికార కూటమికి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఎన్నికల ముందు… ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా స్థానిక సంస్థల శాసనమండలి ఓటర్లే. ఐతే ఇలా పార్టీ మారిన ఓటర్ల సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఓటర్లను నిలబెట్టుకోవడం వైసీపీకి సవాల్‌గా మారింది.

ఇప్పటివరకు పార్టీ మారిన వారి సంఖ్యపై క్లారిటీ లేకపోవడం…. ఇంకా ఎంతమంది జంప్‌ చేస్తారనేది చెప్పలేకపోవడంతో బొత్సను బరిలోకి దింపడం ద్వారా… వలసలకు బ్రేక్‌ వేయాలని భావించింది వైసీపీ…. సుమారు 15 ఏళ్ల పాటు మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన బొత్సకు ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ అనుచర గణం ఉంది. అందుకే ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేసిందంటున్నారు. ఇప్పటివరకు అధికార పక్షం తన అభ్యర్థిని ప్రకటించలేదు. అయినప్పటికీ వైసీపీ ఎన్నికకు సిద్ధమంటూ బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

తొలి ఎన్నికలో విజయం సాధించాలనే పట్టుదలతో కూటమి..
ఇక అటు అధికార ఎన్‌డీఏ కూటమికి ఉమ్మడి విశాఖ జిల్లాలో మంచి పట్టు ఉంది. ఈ జిల్లాలో ఎన్‌డీఏ కూటమికి మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు… విశాఖ, అనకాపల్లి ఎంపీలు కూటమికి చెందిన నేతలే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే తొలి ఎన్నికలో విజయం సాధించాలనే పట్టుదల కూటమిలో కనిపిస్తోంది. టీడీపీకి గతంలో ఉన్న ఓట్లతోపాటు కొత్తగా చేరిన వారితో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కొట్టిపడేయలేమంటున్నారు. ఇక ఆపరేషన్‌ ఆకర్ష్‌ ద్వారా ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మున్సిపల్‌ కౌన్సిలర్లను చేర్చుకుంటే… ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడం పెద్ద పనేమీ కాదంటున్నారు పరిశీలకులు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తి తదితరుల అండదండలతో వైసీపీ సిట్టింగ్‌ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని స్కెచ్‌ వేస్తోంది టీడీపీ… కూటమి తరఫున ఎవరైనా ఈజీగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న నేతలకు చెక్‌ చెప్పేలా… వైసీపీ బొత్సను రంగంలోకి దింపి రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసింది.

వాస్తవానికి ఈ స్థానం నుంచి ముందుగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేర్లను పరిశీలించింది. అయితే వీరిద్దరి కన్నా మాజీ మంత్రి బొత్స అయితేనే టీడీపీని తట్టుకోగలరని ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలంతా ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని… ఎన్‌డీఏ కూటమిని ఎదుర్కొనే అంగ, అర్ధ బలాలు ఉన్న నేత బొత్స ఒక్కరేనని పార్టీ నేతలంతా అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. బొత్సకు జిల్లాలో ప్రతి మండలంలోనూ అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండటం అడ్వాంటేజ్‌గా భావిస్తోంది.

టీడీపీని తట్టుకోవడం బొత్సకే సాధ్యమన్న వైసీపీ నేతలు..
ఇక బొత్స బంధువర్గం కూడా జిల్లాలో ఎక్కువగా ఉండటం వల్ల కూటమిని దీటుగా ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ నెల 30న జరిగే ఎన్నికకు 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. వైసీపీపై పైచేయి సాధించేందుకు టీడీపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది..? ఎవరిని అభ్యర్థిగా రంగంలోకి దింపనుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు.. నారా లోకేశ్ రెడ్‌బుక్‌ ఓపెన్ చేసేశారా?