ఫైల్స్ దగ్ధం కేసు.. పోలీసుల అదుపులో రామారావు.. ఎవరీ రామారావు?

ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలంగా పని చేశారు రామారావు. గతంలోనూ ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

ఫైల్స్ దగ్ధం కేసు.. పోలీసుల అదుపులో రామారావు.. ఎవరీ రామారావు?

Files Burnt Case : పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దగ్ధం కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. ఓఎస్డీ ఎస్వీ రామారావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరు నుంచి డీఎస్పీ ఆఫీసుకి తరలించారు. సగం కాలిన రికార్డులు, హార్డ్ కాపీలను కూడా గన్నవరం తీసుకెళ్లారు పోలీసులు. రామారావుని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ప్రశ్నించారు. రామారావు సూచనలతోనే ఫైల్స్ దహనం చేశానని కారు డ్రైవర్ చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలంగా పని చేశారు రామారావు. గతంలోనూ ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరోసారి ఫైల్స్ దగ్ధం ఘటనలో రామారావు పేరు రావడంపై ఎక్సైజ్ శాఖలో చర్చ మొదలైంది.

కృష్ణా జిల్లా యనమలకుదురు సమీపంలోని కరకట్ట రోడ్డు మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన దస్త్రాలను దగ్ధం చేశారు. దీనికి సంబంధించి పోలీసులు డ్రైవర్ నాగరాజుని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో నాగరాజు కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కు సంబంధించిన సమీర్ శర్మ ఓఎస్డీ రామారావు, అటెండర్.. ఫైల్స్ ను దగ్ధం చేయమన్నారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు నాగరాజు. ఫైల్స్ దగ్ధం చేయమని రామారావు ఎందుకు చెప్పాడు? అనేదానిపై పోలీసులు విచారిస్తున్నారు.

Also Read : ఫైల్స్‌ కాల్చివేత అందుకేనా.. ఇది వారి పనేనా.. తప్పు మీద తప్పుతో మరింత ముప్పు తెచ్చుకుంటున్నారా?

కాగా, దగ్ధం చేసిన ఫైల్స్ లో మైనింగ్ శాఖకు సంబంధించిన రికార్డులు కూడా ఉండటం సంచలనంగా మారింది. మైనింగ్ ఫైల్స్ ఎందుకు వచ్చాయి? ఎవరు పంపించారు? కారణాలు ఏంటి? ఈ కోణంలో సమీర్ శర్మ ఓఎస్డీ రామారావుని పోలీసులు విచారించనున్నారు. గతంలో ఎక్సైజ్ శాఖలో పని చేసిన రామారావు అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఫైల్స్ దహనం కేసులో రామారావు పేరు తెరపైకి రావడం చర్చకు దారితీసింది. రామారావు వెనుక ఎవరున్నారు? ఈ పని ఎవరు చేయించారు? ఎందుకు ఫైల్స్ దగ్ధం చేయించారు? అనేది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.