Chandrababu Naidu : చంద్రబాబును కలిసిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు, అన్యాయం జరిగిపోయిందని ఆవేదన
కొంత కాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. (Chandrababu Naidu)

Chandrababu Naidu
Chandrababu Naidu – Meda Vijay Shekar Reddy : ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నాయకులు పార్టీలు జంప్ చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఇప్పటికే కండువాలు మార్చేశారు. మరికొంత మంది అదే బాటలో ఉన్నారు. తాజాగా, రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు విజయశేఖర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. విజయ శేఖర్ రెడ్డి కొంత కాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, రాజంపేట టిక్కెట్ కావాలని గతంలోనే చంద్రబాబుని కోరినట్లు విజయశేఖర్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ గా రాజంపేటే కావాలంటూ మేం ఉద్యమించాం అని ఆయన గుర్తు చేశారు. రాజంపేటకు కొత్త నాయకత్వం కావాలన్నారు. అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ గా రాజంపేటను చేసే వాళ్లకు మద్దతిస్తామన్నారు.
చంద్రబాబు ఆదేశిస్తే రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని విజయశేఖర్ రెడ్డి అన్నారు. రాజంపేటకు జరిగిన అన్యాయంలో తన సోదరుడు, ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పాత్ర కూడా ఉందని విజయశేఖర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి భయపడో, మరో కారణమో కానీ.. ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి సైలంట్ అయ్యారని చెప్పారు. తనకొచ్చిన సమాచారం మేరకు ఎమ్మెల్యే మేడాపై లోకేశ్ ఆరోపణలు చేసి ఉండొచ్చన్నారాయన.