టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ కేసు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • Published By: vamsi ,Published On : August 26, 2019 / 07:52 AM IST
టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ కేసు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Updated On : August 26, 2019 / 7:52 AM IST

గుంటూరు జిల్లా టిడిపీ సీనియర్ నేత, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసుల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2014లో అక్రమ మైనింగ్‌ విషయంలో సీఐడీ హైకోర్టుకు నివేదికను సమర్పించింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం ప్రభుత్వ నిర్ణయమని హైకోర్టు అభిప్రాయపడింది.

అక్రమ మైనింగ్ జరిగినట్లు కచ్చితమైన ఆధారాలు అయితే సీఐడీ నివేదికలో ఉన్నట్లు హైకోర్టు వెల్లడించింది. యరపతినేని బ్యాంకు లావాదేవీలు కూడా అనుమానంగా ఉన్నాయని, సీబీఐతో పాటు ఈడీ దర్యాప్తు కూడా ఇదే విషయంలో జరిపితే బాగుంటుందని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అక్రమ మైనింగ్‌ విషయంలో యరపతినేని శ్రీనివాసరావు, మరికొందరిపై గురువాచారి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని మనసులో పెట్టుకుని యరపతినేని తనపై కక్షగట్టి బెదిరింపులకు పాల్పడ్డారని, మైనింగ్ అధికారులు, పోలీసులు యరపతినేనికి సహకరించారనే ఆరోపణలతో గురువాచారి కోర్టును ఆశ్రయించారు.

విచారణ జరిపిన కోర్టు.. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు యరపతినేనితో పాటు 12 మందిపై అక్రమ మైనింగ్ కేసులను నమోదు చేశారు. అయితే సీబీఐ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని, బుధవారంలోగా కోర్టుకు దీనిపై నిర్ణయాలను తెలపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కోర్టు.