జర్నలిస్ట్‌లకు అక్రిడిటేష‌న్ కార్డులపై హైకోర్టు స్టేటస్ కో

జర్నలిస్ట్‌లకు అక్రిడిటేష‌న్ కార్డులపై హైకోర్టు స్టేటస్ కో

Updated On : January 6, 2021 / 7:40 AM IST

జర్నలిస్ట్‌లకు మీడియా అక్రిడిటేష‌న్ కార్డుల జారీ వ్యవహారంపై స్టేటస్‌ కో విధించింది హైకోర్టు. కౌంటర్‌ దాఖలు చేయాలని సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 25వ తేదీకి వాయిదా వేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

జీవో 123ను సస్పెండ్‌ చేయాలని కోరుతూ ఏపీ మీడియా ఫెడరేషన్‌ కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. ప్రస్తుతం ఉన్న అక్రెడిటేషన్‌ కార్డులనే కొనసాగించాలని కోరగా.. ఇప్పటికే కొందరికి కార్డులు జారీ చేసినట్టు ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.

వాస్తవానికి ఇప్పటివరకు అమలులో ఉన్న సంప్రదాయానికి భిన్నంగా ఎంపికచేసిన ప్రభుత్వ విభాగాల అధికారులతో క‌మిటీల‌ను ఏర్పాటు చెయ్యాలని తీసుకున్న నిర్ణయం పట్ల జర్నలిస్టులలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్ర‌భుత్వ చ‌ర్య కొంత‌మంది జ‌ర్న‌లిస్ట్‌ల‌కు మోదం, మరి కొందరికి ఖేదంగా మారింది.

జ‌ర్న‌లిస్ట్ సంఘాలను పక్కనపెడుతూ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ కమిషనర్‌ నాయకత్వంలో రాష్ట్ర స్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీ (ఎస్‌ఎంఏసీ)ని, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్ధాయి కమిటీ (డీఎంసీఏ)ని ఏర్పాటుచేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుని ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.