శ్రీకాకుళంలో కరోనా ఎలా వచ్చింది ? ఒకే ఇంట్లో 3 కేసులు

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 10:44 AM IST
శ్రీకాకుళంలో కరోనా ఎలా వచ్చింది ? ఒకే ఇంట్లో 3 కేసులు

Updated On : April 29, 2020 / 10:44 AM IST

ఇన్నాళ్లు ఒక్క కరోనా కేసు లేకుండా నెట్టుకొచ్చిన శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారే మూడు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏపీలో నమోదైన 61 కొత్త కేసుల్లో మూడు శ్రీకాకుళం జిల్లాలోనివే. అయితే, ఈ మూడు కేసులు ఒకే ఇంట్లో నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన వ్యక్తి ఢిల్లీలో పని చేసేవాడు.

మార్చి 19వ తేదీన స్వస్థలానికి వచ్చాడు. కాగువాడ గ్రామంలో అత్తవారింటిలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఢిల్లీ నుంచి ప్రయాణించిన సమయంలో రైలులో మర్కజ్ కు వెళ్లివచ్చిన వారు ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో అడుగుపెట్టిన సమయంలో పరీక్ష చేస్తే నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అతడికి పీసీఆర్ టెస్టు నిర్వహించగా, నెగిటివ్ గానే వచ్చింది.  కానీ, ఆశ్చర్యకరంగా అతడి కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. 28 రోజుల లాక్ డౌన్ ముగిసిన అనంతరం ఇతను వివిధ ప్రాంతాల్లో సంచరించాడు. 

ఇటీవల గ్రామానికి చెందిన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలిందని జిల్లా వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పాతపట్నం ప్రాంతంలో పగడ్బంధీగా లాక్ డౌన్  అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగువాడ, సీది గ్రామాల్లో 26 మందిని క్వారంటైన్‌కు తరలించారు. మండలానికి సరిహద్దులో ఉన్న నాలుగు మండలాల పరిధిలోని 27 గ్రామాలను కంటైన్‌మెంట్‌ ప్రాంతాలుగా అధికారులు  గుర్తించారు.

పాతపట్నం మండలాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మండలం పరిధిలోని 18 గ్రామాలలో హైపోక్లోరైడ్ స్ప్రే, బ్లీచింగ్, పారిశుధ్య పనులు చేపట్టారు. 23 మంది వైద్యాధికారులతో పాటు 200 మంది సిబ్బందితో ఇంటింటి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాతపట్నంలో కోవిడ్ కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేశారు. త్రాగునీరు, నిత్యావసరాలు డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించారు.