YCP Bheemili Constituency : వైసీపీకి భీమిలి టెన్షన్..? మూడుసార్లు మూడు ప్రయోగాలు.. ముగ్గురు జంప్..
YCP Bheemili Constituency : భీమిలి వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు ఆ పార్టీని వీడటం పొలిటికల్ ఈక్వేషన్స్‌ను మార్చేస్తుంది. నియోజకవర్గంలో పట్టు పెంచుకోవాలని వైసీపీ ఆవిర్భావం నుంచి ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తుంది. ఒక్క 2019లో పార్టీ వేవ్ వచ్చినప్పుడు మినహా.. 2014, 2024లో రెండుసార్లు ఫ్యాన్ పార్టీ ఇక్కడ ఓడిపోయింది. అయితే, ఇప్పుడు చిన్న శ్రీను తర్వాత భీమిలిలో వైసీపీకి పెద్దదిక్కెవరు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్‌గా మారింది.
YCP Bheemili Constituency : భీమిలి వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు ఆ పార్టీని వీడటం పొలిటికల్ ఈక్వేషన్స్‌ను మార్చేస్తుంది. గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్న భీమిలి రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉన్న నియోజకవర్గం. ఈ సెగ్మెంట్లో పట్టు పెంచుకోవాలని వైసీపీ ఆవిర్భావం నుంచి ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తుంది. ఒక్క 2019లో పార్టీ వేవ్ వచ్చినప్పుడు మినహా.. 2014, 2024లో రెండుసార్లు ఫ్యాన్ పార్టీ ఇక్కడ ఓడిపోయింది. అయితే ఇప్పుడు చిన్న శ్రీను తర్వాత భీమిలిలో వైసీపీకి పెద్దదిక్కెవరు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్‌గా మారింది. పార్టీ, క్యాడర్ లీడర్లను ముందుండి నడిపించడమే కాకుండా..చిన్న శ్రీను ప్లేస్‌ను రీప్లేస్ చేసే లీడర్ ఎవరు.? మళ్లీ కొత్త నేతను తెరపైకి తెస్తారా.? విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గ ఇంచార్జ్‌ను వైసీపీ అధిష్టానం భీమిలికి షిఫ్ట్ చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటిదాకా పది సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే భీమిలిలో టీడీపీ ఏడు సార్లు గెలిచింది. కాంగ్రెస్ ప్రజారాజ్యం, వైసీపీ ఒక్కోసారి గెలిచాయి. ఇక భీమిలిలో 2019లో వైసీపీ గెలిచినా రాజకీయంగా పట్టు సాధించలేకపోయింది. మూడు వర్గాలు ఆరు గ్రూపులు అన్నట్లుగా అంతర్గత కుమ్ములాటలతో సరిపెట్టారు. మరోవైపు భీమిలీ వైసీపీ నాయకత్వ బాధ్యతలు ఎవరికి ఇచ్చినా వారు తప్పుకోవడం నెగెటివ్ సెంటిమెంట్‌గా టాక్ నడుస్తోంది. దాంతో విశాఖ జిల్లాలో రాజకీయంగా ఎంతో కీలకమైన ఈ నియోజకవర్గంలో వైసీపీ ఇప్పుడు అయోమయంలో పడిపోయినట్లు అవుతోంది.
భీమిలి ఇంచార్జ్‌గా 2024 డిసెంబర్లో చిన్న శ్రీనుకు బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధినాయకత్వం. దాదాపుగా రెండేళ్ల పాటు ఆయన పార్టీ బాధ్యతలను చూస్తూ వచ్చారు. అంగబలం అర్ధ బలం ఉండటంతో పాటు బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన భీమిలిలో వైసీపీని పటిష్టం చేసేందుకు ఎంతో కొంత శ్రమించారు. ఆయనే 2029 ఎన్నికల్లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున చేస్తారని అంతా అనుకున్నారు. కానీ స్థానిక ఎన్నికల ముందే ఆయన సడెన్‌గా ఫ్యాన్ నీడ నుంచి బయటకు వచ్చి సైకిలెక్కేశారు. దాంతో లోకల్ ఫైట్ దూసుకొస్తున్న వేళ వైసీపీ ఇక్కడ నాయకత్వ లేమితో సతమతమవుతోంది. వైసీపీ గడచిన మూడు ఎన్నికల్లో ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. అందులో 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన కర్రి రాము అయితే అప్పట్లో ఓడిపోగానే వైసీపీకి రాజీనామా చేశారు.
2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ భీమిలి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేశారు. తీరా ఓటమి చెందగానే పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ప్లేస్‌లో చిన్న శ్రీనును ఇంచార్జ్‌గా పెడితే..సరిగ్గా స్థానిక ఎన్నికల వేళ ఆయన సైకిల్ ఎక్కేయడంతో వైసీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. లోకల్ బాడీస్‌లో ఏకగ్రీవాలు జరగనిచ్చే ముచ్చటే లేదని వైసీపీ అంటోంది. కానీ భీమిలీ సీటులో ఆ పార్టీకి ఇంచార్జే లేడు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎవరిని తెచ్చిపెట్టినా కూడా ఆయన అందరికీ పరిచయం అయ్యేలోపే స్థానిక ఎన్నికల అయిపోతాయని అంటున్నారు.
మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అన్ని విధాలుగా రాజకీయంగా పట్టు బిగించారు. దానికి తోడు భీమిలిలో జనసేన, టీడీపీ రెండూ కూడా బలంగా ఉన్నాయి. భీమిలి ఇంచార్జ్ విషయంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
