Andhra Pradesh: అనంతపురంలో జగన్, కడపలో అవినాశ్ పర్యటనలు.. ఏపీలో ముఖ్యమైన వార్తల వివరాలు ..
అనంతపురం జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీ అవినాశ్ రెడ్డికడప నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

Andhra pradesh
Andhra Pradesh: ఏపీలో ముఖ్యమైన వార్తల వివరాలను ఓ సారి పరిశీస్తే.. అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తుండగా.. ఎంపీ అవినాశ్ రెడ్డి కడప నియోజకవర్గంలో పర్యటిస్తారు. అదేవిధంగా నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి, అధికారులు విడుదల చేస్తారు.
అనంతపురం జిల్లాలో జగన్ పర్యటన ..
ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని నార్పల మండల కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాలో కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేయనున్నారు.
తిరుమల సమాచారం ..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు రావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం శ్రీవారిని 62,971 మంది దర్శించుకున్నారు. రూ. 3.39 కోట్ల ఆదాయం చేకూరింది. సర్వదర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్‌లో వేచి ఉన్నారు. టోకెన్ లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతుంది.
మరో 3వేల కోట్ల అప్పు ..
ఏపీ ప్రభుత్వం మరో రూ. 3వేల కోట్లు అప్పు తెచ్చింది. బుధవారం RBI నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని సమీకరించింది. దీంతో ఏప్రిల్ నెలలో అధికారికంగా రూ.6,000 కోట్ల అప్పు తెచ్చినట్లయింది. ఈ ఆరువేల కోట్ల అప్పుతో పాటు, కేంద్రం నుంచి పన్నుల్లో వాటాగా రూ.3,000 కోట్లు వచ్చాయి. ఇవిగాక రాష్ట్ర ఖజానాకు రోజువారీ వచ్చే పన్ను ఆదాయం సగటున రోజుకు రూ.400 కోట్ల చొప్పున వస్తుంది.
కోటి కుటుంబాలకు చేరిన ‘జగనన్నే నా భవిష్యత్’ ..
సీఎం జగన్ వినూత్నంగా చేపట్టిన ‘జగనన్నే నా భవిష్యత్’ కార్యక్రమం కోటి మైలురాయి దాటింది. ఈనెల 7వ తేదీ నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రంలోని కోటి కుటుంబాల వద్దకు పార్టీ నేతలు వెళ్లి సర్వే నిర్వహించారు. 79 లక్షల మంది మిస్డ్ కాల్స్ ఇచ్చారు. 1.60 కోట్ల కుటుంబాలను కలవాలని లక్ష్యంగా నిర్ణయించారు. కోటి కుటుంబాల సందర్శన పూర్తయిన సందర్భంగా పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు.
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం ..
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అరవపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పుంగనూరు కు చెందిన కుమార్, భాగ్యరాజ్, రవిగా గుర్తించారు.
29 నుంచి ఏపీలో స్కూళ్లకు సెలవులు ..
రాష్ట్రంలో స్కూళ్లకు ఈనెల 29 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చివరిరోజు విద్యార్థులు, తల్లిదండ్రులతో మీటింగ్ నిర్వహించి రిపోర్టు కార్డులను అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరయ్యేలా అధికారులు, స్కూళ్ల ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించింది. జూన్ 12 నుంచి ఏపీలో తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
రేపు తిరుపతి జిల్లాకు గవర్నర్ ..
తిరుపతి జిల్లాలో మూడు రోజుల పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం తిరుపతికి చేరుకుని అక్కడే బస చేస్తారు. శుక్రవారం శ్రీవేంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని సాయంత్రానికి తిరుమలకి చేరుకుంటారు. శనివారం శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతారు.
ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు ..
ఏపీలో భారీగా డీఎస్పీల బదలీలు జరిగాయి. ఒకేసారి 77 మందిని బదిలీ చేస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత ఉత్తర్వులు జారీ చేశారు. ఒకేచోట మూడేళ్లు పూర్తి చేసుకున్న చాలా మంది అధికారులకు స్థాన చలనం కలిగింది. ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీ తర్వాత డీఎస్పీల బదిలీలు చోటు చేసుకున్నాయి.
నేడు ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలు ..
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను విజయవాడలో బుధవారం సాయంత్రం ఐదింటికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. వృత్తి విద్య కోర్సుల పరీక్ష ఫలితాలనూ విడుదల చేస్తారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలకు 9,20,552 మంది, వృత్తి విద్య కోర్సు పరీక్షలకు 83,749 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వరకు విద్యార్థులు పరీక్షలు రాశారు.
కడపలో అవినాశ్ రెడ్డిపర్యటన ..
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బుధవారం కడప, మైదుకూరు నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలలో పాల్గొంటారు.