ఆ ప్రాంతంలో తెలుగు తమ్ముళ్ల ఫైటింగ్.. అధిష్ఠానం నచ్చజెప్పినా లీడర్ల నో కాంప్రమైజ్
టికెట్ దక్కించుకున్నప్పటికీ అందరినీ కలుపుకొని పోవడంలో జయచంద్రారెడ్డి పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ లీడర్లే చెబుతున్నారు.

TDP
ఉమ్మడి చిత్తూరు జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం తంబళ్లపల్లి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 12 చోట్ల టీడీపీ మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించగా..పుంగనూరు, తంబళ్లపల్లి ఈ రెండు స్థానాలను మాత్రం చేజార్చుకుంది. పుంగనూరులో వైసీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించగా..తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకనాథ రెడ్డి గెలిచారు. 2014లో టీడీపీ తరఫున శంకర్ యాదవ్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందగా..2019, 2024 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు వైసీపీ ఈ సీటును కైవసం చేసుకుంది.
మొన్నటి ఎన్నికలప్పుడు తంబళ్లపల్లిలో టీడీపీ లాస్ట్ మినిట్‌లో చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. అప్పటి వరకు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌ను కాదని, జయచంద్రారెడ్డి అనే కొత్త నేతకు టికెట్ కట్టబెట్టింది పార్టీ. పదివేల ఓట్ల తేడాతో జయచంద్రారెడ్డి ఓడిపోయారు. టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల తర్వాత జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్‌లలో ఎవరు పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ అన్నది క్లారిటీ లేకుండా పోయింది.
ఎన్నికల తర్వాత తంబళ్లపల్లి తెలుగు తమ్ముళ్ల పంచాయితీ పూర్తిగా చేయి దాటిపోయింది. ఎన్నికల్లో టికెట్ దక్కని శంకర్ యాదవ్, పోటీ చేసి ఓడిన జయ చంద్రారెడ్డిలు ఒకే పార్టీలోనే ఉంటూ ఉప్పు-నిప్పులా మారారు. నియోజకవర్గంలో టీడీపీ రెండు ముక్కలైంది. గతేడాదిగా ఈ రెండు వర్గాల మధ్య నిత్యం గొడవలు కామన్ అయ్యాయి. రాష్ట్రమంతా అధికారం ఉన్నా..తంబళ్లపల్లిలో మాత్రం టీడీపీ క్యాడర్‌కు ఆ సంతోషం దక్కడం లేదట. మరోవైపు తంబళ్లపల్లిలో తమ్ముళ్ల గొడవ టీడీపీ అధిష్టానంకు తలనొప్పిగా మారిందంటున్నారు. ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిర్చేందుకు పార్టీ కొన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదట.
జయచంద్రారెడ్డి పూర్తిగా విఫలమయ్యారా?
ఎన్నికల ముందు వరకు ఇంచార్జ్‌గా ఉన్న శంకర్ యాదవ్‌కి టికెట్ కేటాయిస్తే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదని క్యాడర్ భావిస్తోంది. యాదవ, బీసీ సామాజిక వర్గాలు శంకర్ యాదవ్ వైపు బలంగా నిలబడ్డాయి. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా శంకర్ యాదవ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేవారు. ఎన్నికల్లో తనకు టికెట్ పక్కా అని హోప్స్ పెట్టుకుని పని చేశారు. కానీ ఆఖరి విషయంలో సీన్ మారిపోయింది. జయచంద్రారెడ్డి అనే కాంట్రాక్టర్‌ను పార్టీ అధిష్ఠానం తంబళ్లపల్లి తెరపైకి తెచ్చింది.
టికెట్ దక్కించుకున్నప్పటికీ అందరినీ కలుపుకొని పోవడంలో జయచంద్రారెడ్డి పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ లీడర్లే చెబుతున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలోనూ ఖర్చుకు వెనుకాడారని గుసగుసలు పెట్టుకుంటున్నారు. అన్నింటికీ మించి జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి కుటుంబానికి సన్నిహితుడని, గతంలో పెద్దిరెడ్డి దగ్గర సబ్ కాంట్రాక్టులు కూడా తీసుకునేవారని శంకర్‌యాదవ్ వర్గం ఆరోపిస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ శంకర్ యాదవ్‌నే నియోజకవర్గ ఇంచార్జ్‌గా అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఇక్కడ వ్యవహారం సద్దుమణిగేలా లేదంటున్నారు లోకల్ టీడీపీ లీడర్లు. సైకిల్ పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుందో..తంబళ్లపల్లి తమ్ముళ్ల గొడవకు ఎండ్ కార్డ్ ఎప్పుడో వేచి చూడాలి మరి.