Vijayawada Durgamma Temple : ఇంద్రకీలాద్రిపై ఇంటిదొంగలు
విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. అమ్మవారి ముక్కుపుడక దగ్గర నుంచి తాజాగా జరిగిన విజిలెన్స్ దాడుల వరకూ తరచూ వివాదాలే.

Vijayawada Durgamma Temple
Vijayawada Kanaka Durgamma Temple : విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. అమ్మవారి ముక్కుపుడక దగ్గర నుంచి తాజాగా జరిగిన విజిలెన్స్ దాడుల వరకూ తరచూ వివాదాలే. దీంతో.. అసలు దుర్గగుడిలో ఏం జరుగుతోందనే సందేహాలు తలెత్తుతున్నాయి? ఆలయంలో అనధికారికంగా అధికారం చెలాయిస్తున్న వారే వివాదాలకు కారణమా? విజయవాడ ఇంద్రకీలాద్రికి యుగాల నాటి చరిత్ర ఉంది. కొండపై కొంగు బంగారమై విరాజిల్లుతున్న దుర్గమ్మపై.. కోట్లాది మంది భక్తుల విశ్వాసం. కానీ దుర్గమ్మ ఆలయం నిత్యం వివాదాలకు నెలవుగా మారుతోంది. అమ్మవారి ముక్కుపుడక అంశం నుంచి ..దుర్గమ్మ రథానికి ఉన్న వెండి సింహాల మాయం వరకూ అన్నీ వివాదాస్పదమే. క్షుద్రపూజల కలకలం నుంచి విజిలెన్స్ అధికారుల తనిఖీల వరకూ ఇంద్రకీలాద్రి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
గతంలో బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఏసిబి అధికారులు ఐదు రోజుల పాటు వివిధ విభాగంలో సోదాలు మరువకముందే… మరోసారి విజిలెన్స్ సోదాలు నిర్వహించడం కలకలం రేపాయి. వరుస తనిఖీలతో దుర్గమ్మ సన్నధిలో అవినీతి ఏ విధంగా పెరుకుపోయిందో… అని భక్తులు విస్మయానికి గురవుతున్నారు. ఏసీబీ అన్ని విభాగాలలో భారీగా అక్రమాలు గుర్తించి 15 మందిపై రిపోర్ట్ ఇవ్వడంతో దేవాదాయ కమిషనర్ ఆదేశానుసారం ఆలయ ఈఓ వారిని సస్పెండ్ చేశారు. తాజాగా రెండ్రోజులుగా ఇంద్రకీలాద్రిపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు.
దుర్గగుడికి సంబంధించిన వివిధ శాఖలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేశారు. చీరలు, నిత్య అన్నదాన విభాగానికి చెందిన ఫైల్స్ తో పాటు ఇంజనీరింగ్, టోల్ టిక్కెట్ల విభాగంలో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో నిత్యాన్నదానం, లడ్డు, పులిహోర తయారీలో లెక్కలు తారుమారు చేసినట్లు గుర్తించిన అధికారులు…. చీరల కౌంటర్ లో దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి లేకుండా ఈవో సొంత నిర్ణయంతో చీరలు విక్రయించినట్లు అధికారులు దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది.
మరోవైపు దుర్గగుడిలో ఏ కాంట్రాక్టు ఇవ్వాలన్నా… ఉద్యోగస్తులను బదిలీ చేయాలన్నా ఆ ఇద్దరికి తెలియకుండా ఏ పని జరగదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని దుర్గగుడి ఉద్యోగస్తులే బహిరంగంగా చెబుతున్నారు. దుర్గగుడి ఉన్నత అధికారులు కూడా ఆ ఇద్దర్నీ ఏం చేయలేని పరిస్థితి ఉందని సిబ్బంది చెవులు కొరుకుంటున్నారు. దుర్గగుడిలోని అన్ని విభాగాల్లో ఏం జరగాలన్నా ఆ ఇద్దరూ ఓకే అనాల్సిందే. లేకపోతే వారు శాఖపరమైన ఇబ్బందులతో పాటు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.
ఇప్పటికే ఆ ఇద్దరు షాడోలపై ఏసిబి అధికారులు ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజా విజిలెన్స్ అధికారులు సోదాలతో పాటు ఆ షాడోలకు ఏయే శాఖలో ఉద్యోగస్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారు? అనేదానిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు షాడోలపై దృష్టి పెట్టి వాళ్లు దుర్గగుడి పైకి రాకుండా చేస్తే అవినీతిని కొంత వరకు అరికట్టవచ్చని ఆలయ సిబ్బంది అంటున్నారు.
దుర్గగుడిలో కీలక ఉద్యోగస్తుల నుంచి విజిలెన్స్ అధికారులు పూర్తి స్ధాయిలో కూపీ లాగుతున్నారు. ఇప్పటికే ఆలయ ఈవో సురేశ్ బాబు నుంచి వివరాలు సేకరించారు. ఏదీ ఏమైనా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో అవినీతి, అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేపట్టడం సంతోషం అని భక్తుల అంటున్నారు.