వైసీపీ కార్పొరేటర్ల చేరికకు అశోక్ గజపతిరాజు అడ్డుపడుతున్నారా?
వీరిలో చాలామందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నది టీడీపీ శ్రేణులు ఆరోపణ.

Ashok Gajapathi Raju
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల అధికారాలపై గురిపెట్టారట టీడీపీ నేతలు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇప్పటికే మెజారిటీ సభ్యులను తమ వైపు తిప్పుకుని, అవిశ్వాసం తీర్మానాలు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. కానీ, ఓ మున్సిపల్ కార్పొరేషన్ లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
కూటమిలో కలిసేందుకు వైసీపీ కార్పొరేటర్లు సై సై అంటున్నా..టీడీపీ నేతలు మాత్రం నై నై అంటున్నారట. మాకు కార్పొరేషన్ పీఠమూ వద్దు, మీరూ వద్దంటూ వారి ప్రతిపాదనలను తిప్పుకొడుతున్నారట . ఇదేమీ చిత్రమంటూ ముక్కున వేలేసుకుంటున్నారట ఆ పార్టీ అధిష్టాన పెద్దలు. ఇంతకీ ఎక్కడ ఈ పరిస్థితి…? ఎందుకు వారిని తిరస్కరిస్తున్నారు?
మేం మీ సైడ్ వచ్చేస్తాం. పీఠాన్ని మీకిచ్చేస్తాం అంటూ వైసీపీ కార్పొరేటర్లు బ్రతిమాలుతున్నా.. వద్దే వద్దంటున్నారు విజయనగరం టీడీపీ నేతలు. దీంతో చాన్స్ ఉన్నా.. ఎందుకిలా అవకాశాలను చేజార్చుకుంటున్నారంటూ అక్కడి టీడీపీ నేతల తీరు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు కూటమి పెద్దలు. ఏపీలో కూటమి అధికారంలో ఉన్నా, మెజారిటీ మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు వైసీపీ గుప్పెట్లోనే ఉన్నాయి. దీంతో పలు మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో కూటమి ప్రభుత్వం పాగా వేసేందుకు స్కెచ్ వేస్తోందట.
ఏపీలో చాలా చోట్ల సభ్యులను తమవైపు తిప్పుకోవడం, అవిశ్వాస తీర్మానాలు, క్యాంపు రాజకీయాలతో కూటమి నేతలు బిజీ బిజీగా ఉన్నా.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాలను తమ చేజిక్కించుకునేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కానీ.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో భిన్నమైన పరిస్థితి కనబడుతోంది.
కండువాలు మార్చుకునేందుకు సిద్ధం?
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీ అధికారంలో ఉంది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో, వైసీపీకి చెందిన మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీ వైపు చూస్తున్నారు. టీడీపీ ఓకే అంటే, కండువాలు మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. కానీ, అశోక్ గజపతిరాజు బంగ్లా నుండి ఎటువంటి సిగ్నల్ రాకపోవడం ప్రశ్నర్ధకంగా మారింది. ఈ విషయంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కొంత సానుకూలంగా ఉన్నా, తండ్రి అశోక్ గజపతిరాజు మాత్రం ససేమిరా అంటున్నారట. అసలు అశోక్ గజపతిరాజు ఎందుకు అడ్డు చెబుతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను 49 డివిజన్లలో విజయకేతనం ఎగురవేసి ఎదురేలేదనిపించింది వైసీపీ. కేవలం ఒకే ఒక్క స్థానాన్ని దక్కించుకుంది టీడీపీ. అయితే ఇప్పుడు టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలో ఉంది. పట్టణంలో వైసీపీ నేతలపై కార్పొరేటర్లలో అసమ్మతి, అసంతృప్తి పెరుగుతోంది. వారి నియంతృత్వ పోకడలపై మండిపడుతున్నారంట.
వైసీపీ అధికారాన్ని కోల్పోయాక, కార్పొరేటర్లను ఆ పార్టీ నేతలు పట్టించుకోవడం మానేశారంట. సొంతపనులు చక్కబెట్టుకోడానికే వినియోగించుకుంటున్నారు. ఇది చాలా మంది కార్పొరేటర్లకు మనస్తాపానికి గురిచేస్తోందట. ముఖ్యంగా నాయకులకు చెప్పుకున్నా ఫలితం కనిపించడం లేదు. కూటమి అధికారంలో ఉండటంతో కార్పొరేటర్లు ఏ పనీ చేసుకోలేకపోతున్నారంట. వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదంట. 11నెలలుగా అనుభవిస్తున్న మానసిక సంఘర్షణ నుంచి బయటపడేందుకు వారు తెగ ప్రయత్నిస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.
అయితే మెజారిటీ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు సన్నిహిత టీడీపీ నేతల ద్వారా మనసులో మాటను అశోక్ బంగ్లా వర్గాలకు చేరవేస్తున్నారు. కానీ, అదేం వింతోగానీ, అట్నుంచి ఉలుకూపలుకు లేదట. ఒకటికి రెండుసార్లు రిమైండ్ చేస్తున్నా అదేతీరు. నిజానికి, 25 మంది వరకు కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తే మేయర్ పీఠం ఆపార్టీ కైవశం అవుతుంది. కానీ, అశోక్ బంగ్లా వర్గాలు ఎటూ తేల్చడంలేదట.
అధికారంలో ఉండీ ఈ కర్మ ఏమిటంటూ..
మరోవైపు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నామన్న మాటేగానీ నగరపాలక సంస్థలో చిన్న పని కూడా చేయించుకోలేకపోతున్నామని ఇటు టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయట. అధికారంలో ఉండీ ఈ కర్మ ఏమిటని అంతర్గత సంభాషణల్లో నిట్టూర్చుతున్నారట. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే, వారే పరిపాలించాలని, మధ్యలో అధికారం లాక్కోవడం పద్ధతి కాదంటూ టీడీపీ శ్రేణులకు హితబోధ చేస్తున్నారట అశోక్ గజపతిరాజు. అలాగే, అవినీతి మరక లేని వారిని మాత్రమే టీడీపీ లో చేర్చుకోవాలంటూ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కి నూరిపోస్తున్నారట. అందుకే, పార్టీలో చేరికల విషయంలోనూ ఎమ్మెల్యే అదితి ఆచితూచి అడుగేస్తున్నారు.
వాస్తవానికి, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికైన మెజారిటీ కార్పొరేటర్లంతా మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఫాలోవర్లే. గత ఎన్నికల్లో ఏరికోరి, తన అనుచరులను మాత్రమే టికెట్లు ఇప్పించుకొని గెలిపించుకున్నారు కోలగట్ల. వీరిలో చాలామందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నది టీడీపీ శ్రేణులు ఆరోపణ.
కోలగట్ల అనుచరులని టీడీపీలోకి తీసుకోవడమంటే, తమని అవమానపరచడమేనంటూ కొంతమంది టీడీపీ సీనియర్ నేతలు కూడా అడ్డుపడుతున్నారట. ఈ విషయంలో అశోక్ గజపతి రాజు కూడా ససేమిరా అంటుండటంతో…తండ్రి మాట కాదనలేక, వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల వరకు వేచి చూసే ధోరణిలో ఎమ్మెల్యే అదితి గజపతి ఉన్నారన్న టాక్ నడుస్తోంది.