వైసీపీ నెక్ట్స్ టార్గెట్ ఈయనేనా.. ఈసారి తప్పించుకోవడం కష్టమేనా? జైలుకెళ్లడం ఖాయమేనా?

దేవినేని ఉమామహేశ్వరరావు అంటే గ్రామ స్థాయి అంశాల దగ్గర నుంచి జాతీయ స్థాయి విషయాల వరకు ఏదైనా సరే అనర్గళంగా మాట్లాడేస్తారు. అదే స్థాయిలో ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను అందర్నీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయంగా విమర్శలు చేయాలంటే ప్రత్యర్దులపై దుమ్మెత్తి పోయాలంటే ఉమ్మడి రాష్ట్రంలోనే గాలి ముద్దుకృష్ణమనాయుడుకి పేరుండేది. ఆ తర్వాత అదే స్థాయిలో ఏ అంశం మీదనైనా సరే దేవినేని ఉమా మాత్రమే విమర్శలు చేయగలరని టీడీపీ నేతలు చెప్పుకుంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిలో ఉండి వైఎస్ జగన్‌ని, ఆ పార్టీని ప్రతి రోజు దుయ్యబట్టడమే పనిగా పెట్టుకున్నారు.
వైసీపీ ప్రభుత్వం రాగానే ఫస్ట్ టార్గెట్ దేవినేని ఉమానే అనుకున్నారు:
ఇరిగేషన్ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమని టార్గెట్ చేస్తూ వైసీపీ ఆనాడు అనేక ఆరోపణలు చేసింది. ముఖ్యంగా పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల విషయంలో, నీరు-చెట్టు పనుల విషయంలో విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా కృష్ణా పుష్కరాల పనులు నామినేషన్ పద్ధతిలో మంత్రి అనుచరులకు ఇచ్చారని, దీంట్లో చాలా అవినీతి జరిగిందని ఉమను టార్గెట్ చేస్తూ ఆనాటి ప్రతిపక్షం ఆరోపణలు చేసింది. దీనిపై విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేసింది. వైసీపీ ప్రభుత్వం రావటంతోనే మొదటి టార్గెట్ దేవినేని ఉమానే అని అందరూ భావించారు. అయితే ప్రభుత్వానికి ఉన్న కొన్ని లెక్కల కారణంగా ఏమీ చేయలేకపోతున్నామని వైసీపీ నేతలు అంటున్నారు.
నీరు చెట్టు పనుల విషయంలో ఎక్కడా దొరకలేదు:
రోజురోజుకీ దేవినేని ఉమా విమర్శలకు అంతే లేకుండా పోతోందని వైసీపీ సర్కారు భావిస్తోంది. ఎక్కడ ఏం జరిగినా అటూ ఇటూ తిప్పి ప్రభుత్వానికి అంటగడుతున్నారని వైసీపీ నేతలు ఫీలైపోతున్నారు. దీంతో ఉమపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తోందని, ఒక ఐఏఎస్ అధికారి ద్వారా దేవినేని వ్యవహారాలపై సీక్రెట్‌గా ఎంక్వయిరీ చేశారని చెబుతున్నారు. నీరు-చెట్టు పనుల విషయంలో ఎక్కడో ఓ చోట దొరక్కపోతాడా అని ఇన్నిరోజులు ఎదురు చూశారు. కానీ, ఆ విషయంలో ఆనాటి మంత్రి దేవినేని ఉమా ఎక్కడ దొరకలేదట.
సడెన్ గా తెరపైకి కృష్ణా పుష్కరాల పనుల్లో అవినీతి అంశం:
మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2016 ఆగస్టులో జరిగిన కృష్ణా పుష్కరాల పనుల్లో అవినీతి జరిగిందని విజిలెన్స్ ఎంక్వయిరీ వేసింది. దీనికి బాధ్యులుగా నలుగురు ఇంజనీర్లను గుర్తించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాకి బాధ్యతలు అప్పగించింది. ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన పుష్కరాల పనులు అవినీతి ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చిందనే అనుమానం అందరిలోనూ మొదలైంది. ఆనాడు వందల కోట్ల రూపాయల పనులు జరిగాయి. దుర్గా ఘాట్, కృష్ణవేణి ఘాట్, పద్మావతి ఘాట్, త్రివేణి సంగమం నిర్మాణంలో నామినేషన్లపై పనులను దేవినేని ఉమా అనుచరులకు ఇప్పించారని ఆరోపణలు వచ్చాయి.
అధికారుల వైపు నుంచి నరుక్కుంటూ వచ్చే ప్రయత్నం:
ఎక్కడా పనులు కేటాయించాలంటూ లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వలేదని ఉమ అనుచరులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఏదో ఒక ఆధారం దొరక్కుండా ఇప్పటికిప్పుడు పాత కేసుల నాలుగేళ్ల క్రితం జరిగిపోయిన పనులను ఎంక్వైరీ చేయదు కదా అని వైసీపీ నేతలు అంటున్నారు. దేవినేని ఉమా మాత్రం చాలా ధీమాగా ఉన్నారట.
https://10tv.in/gannavaram-political-drama-vallabaneni-vamsi-comments-in-ysrcp/
తాను మంత్రిగా ఉండగా ఏ తప్పు చేసినా ప్రభుత్వం ఎప్పుడో జైలుకు పంపేదని తన అనుచరులతో అంటున్నారట. ఈసారి మాత్రం ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారుల ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించిన ప్రభుత్వం ఆ వైపు నరుక్కుంటూ వచ్చే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అధికారులతో అసలు విషయాన్ని చెప్పించి… ఉమాను ఇరికిస్తే లోపలకు పంపించవచ్చనే ఆలోచనలో ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.