కేంద్రమంత్రిగా నాగబాబు? టీడీపీ నుంచి ఎవరు?

వర్షాకాల సమావేశాల తర్వాత కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. నాగబాబుకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలనుకుంటే..ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోపు రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది.

కేంద్రమంత్రిగా నాగబాబు? టీడీపీ నుంచి ఎవరు?

Nagababu

Updated On : July 18, 2025 / 8:13 PM IST

మెగా బ్రదర్..జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అమాత్య యోగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు ప్రకటించినట్లు..అంతా అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే నాగబాబు రాష్ట్ర మంత్రి వర్గంలో ఉండాల్సింది. అయితే ఉన్న ఒకే ఒక బెర్త్ కోసం మార్పులు చేయడం ఎందుకని..క్యాబినెట్‌ మార్పులు, చేర్పులు ఉంటాయని..అప్పుడు నాగబాబును తీసుకుంటారని ఎప్పటికప్పుడు కొత్త కొత్త న్యూస్‌ బయటికొస్తోంది. దాంతో నాగబాబుకు అమాత్య యోగం దక్కడం ఆలస్యమవుతోంది.

లేటెస్ట్‌ న్యూస్ ప్రకారం నాగబాబును కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో సెంట్రల్ క్యాబినెట్‌ ఎక్స్‌ప్యాన్షన్ చేస్తారని అంటున్నారు. విస్తరణలో ఏపీకి ఇంకో రెండు బెర్తులు దక్కే అవకాశం ఉందట. అందులో ఒకటి జనసేనకు ఫిక్స్ చేయగా..నాగబాబు ఆ కోటాలో కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో బెర్త్‌ టీడీపీకి ఇస్తారని చెబుతున్నారు. రాయలసీమకు చెందిన టీడీపీ ఎంపీలైనా ఓ ఎస్సీ, మరో బీసీ నేతల్లో ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ పక్కా అని తెలుగు తమ్ముళ్లు గుసగుసలు పెట్టుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్‌లో ఈ అంశంపై క్లారిటీ వచ్చినట్లు పొలిటికల్ గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయ్.

Also Read: IPS అధికారి నుంచి బాలీవుడ్ నటిగా.. డైనమిక్ ఆఫీసర్ సిమలా రూటే వేరు..

సోదరుడు నాగబాబుని రాష్ట్రంలో కంటే కేంద్రమంత్రిగా చేస్తే పదవుల విషయంలో సమీకరణలు చక్కగా సరిపోతాయని పవన్ భావిస్తున్నారట. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రాష్ట్రమంత్రి వర్గంలో ఉన్నారన్న విమర్శలకు తావు ఇవ్వకుండా పవన్ ఈ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. పార్లమెంట్‌లో జనసేనకు ఇద్దరు సభ్యుల బలం ఉంది. మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు నాగబాబు కేంద్రమంత్రి కావాలంటే ఎమ్మెల్సీకి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. అలా అయితే 2026 వరకు ఏపీలో రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యే అవకాశం లేదు.

ఈలోపే నాగబాబును రాజ్యసభకు పంపాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి అవకాశం కల్పించొచ్చు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ అలా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. అయితే గతంలోనే జనసేనకు కేంద్ర సహాయ మంత్రి పదవిని ఆఫర్ చేశారట ప్రధాని మోదీ. అప్పుడు సుముఖుత వ్యక్తం చేయని పవన్ ఇప్పుడు తన సోదరుడు నాగబాబును కేంద్ర మంత్రిని చేయాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. అయితే ఇప్పటికే స్టేట్‌ క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న ఒక బెర్త్ కోసం బీజేపీ పట్టుబడుతోందట. నాగబాబుకు ఇవ్వాలనుకున్న ఆ అమాత్య పదవిని బీజేపీకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ నుంచి ఇప్పటికే ఇద్దరు ఎంపీలో కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు.

ప్రాంతీయ సమీకరణలు?
బీసీ కోటాలో కింజారపు రామ్మోహన్‌నాయుడు, ఓసీ కోటాలో పెమ్మసాని చంద్రశేఖర్‌కు సెంట్రల్‌ క్యాబినెట్‌లో బెర్తులు కల్పించి సామాజిక న్యాయం పాటించారు. మూడో మంత్రి పదవి తీసుకుని రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తే ప్రాంతీయ సమీకరణలు సరిపోతాయని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారట.

ఎస్సీ సామాజిక వర్గం నుంచి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు..బీసీ కోటాలో హిందూపూర్ ఎంపీ పార్థసారథి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే కేంద్ర మంత్రివర్గంలో జనసేన ఉండాల్సిందేనని బీజేపీ పెద్దలు కోరుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ, బీజేపీల నుంచి సెంట్రల్‌ క్యాబినెట్‌లో ఏపీకి ప్రాతినిధ్యం ఉంది. జనసేనను కూడా కలుపుకుంటే కూటమి పార్టీలకు సమ న్యాయం చేసినట్లు అవుతుందని కేంద్ర బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.

వర్షాకాల సమావేశాల తర్వాత కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. నాగబాబుకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలనుకుంటే..ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోపు రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది. దీంతో నాగబాబు కేంద్ర క్యాబినెట్‌లోకి వెళ్తారా లేక స్టేట్‌ క్యాబినెట్‌లోకి తీసుకుంటారా అనేది ఇప్పుడైతే పూర్తి క్లారిటీ లేదు. ఏది ఏమైనా నాగబాబు మంత్రి అవడం ఖాయం..అది కేంద్రమా రాష్ట్రమా అన్నదే తేలాల్సి ఉందంటున్నారు జనసేన నేతలు. సేమ్‌టైమ్‌ కేంద్ర క్యాబినెట్‌లో మరో దక్కనుండటంతో టీడీపీ నేతలు కూడా హ్యాపీగా ఉన్నారట. ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి మరి.