నీటి కొట్లాట : ఇరిగేషన్ అధికారులతో సీఎం జగన్ మీటింగ్

  • Published By: madhu ,Published On : August 12, 2020 / 09:15 AM IST
నీటి కొట్లాట : ఇరిగేషన్ అధికారులతో సీఎం జగన్ మీటింగ్

Updated On : August 12, 2020 / 9:29 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జల వివాదం విషయంలో ఏపీ ప్రభుత్వం మీద చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానున్నారు. 2020, ఆగస్టు 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ శాఖతో సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం అవుతారు.

కేసీఆర్ ఆరోపణలు చేస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు, పలు ఇరిగేషన్ ప్రోజెక్టులపై సమీక్ష చేయనున్నారు. ప్రధానంగా కేసీఆర్ చేసిన ఆరోపణలపై ఈ సమావేశంలో చర్చించి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో తెలంగాణ అధికారులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ వాదనను వినిపించే అంశంపై జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను అపెక్ట్స్ కౌన్సిల్‌ మీటింగ్‌లో చర్చించాలని ఏపీ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ప్రభుత్వం గిల్లికచ్చాలు పెట్టుకుంటోందని ఆరోపణలు చేశారు. పిలిచి పీట వేసి అన్నం పెట్టినా ఏపీ ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్వుతోందన్నారు. ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్ట్ జల విద్యుత్ కోసం నిర్మించిన ప్రాజెక్ట్ అని కేసిఆర్ చేసిన వ్యాఖ్యలపై జగన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

శ్రీశైలం నుండి ఇరు రాష్ట్రాలు నీటిని వాడుకుంటుంటే విద్యుత్ ఉత్పత్తి కోసమే నిర్మించిన ప్రాజెక్ట్ ఎలా అవుతందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎగువన కలిసే వర్షాలను‌ బట్టి గోదావరి నది నీరు సముద్రంలో కలుస్తుందని, ఎగువలో సరిగ్గా వర్షాలు కురువకుంటే పరిస్థితి ఏమిటని ఏపీ ప్రశ్నిస్తోంది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదంటోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన మిగులు జలాల వివరాలను కూడా అపెక్స్ కౌన్సిల్ ముందుకు తీసుకురానున్నారు. కేంద్ర జలశక్తి శాఖ కూడా తమ వాదనలపై సానుకూలంగా వుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఉలిక్కిపడకుండా సామరస్యంగా వూంటూనే అపెక్స్ కౌన్సిల్ ముందు తమ వాదనలు బలంగా వినిపించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. పక్క రాష్ట్రంతో గొడవ పడటం వల్ల అనేక తలనొప్పులు వస్తాయని, న్యాయబద్దంగా తమకు రావలసిన నీటి వాటాలను రాబట్టుకుంటూనే, వివాదాలు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు అండిగిన వెంటనే అపెక్స్ కౌన్సిల్ మందు ఉంచేందుకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏపీ ఇరిగేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.