Pawan Kalyan : విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణం : పవన్ కళ్యాణ్

ఇళ్లల్లో కరెంటు లేకపోవడంతో కొందరు రైల్వే స్టేషన్, బస్టాండుల్లో పడుకుంటున్నారని పేర్కొన్నారు. పరిశ్రమలకు ఇప్పటికే వారాంతంలో ఒక రోజంతా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని తెలిపారు.

Pawan Kalyan : విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Updated On : April 17, 2022 / 6:47 PM IST

Pawan Kalyan : రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. పల్లెల్లో 14 గంటలు, పట్టణాల్లో 8 గంటలకు తగ్గకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని వాపోయారు. మొబైల్ ఫోన్ వెలుతురులో ప్రసవాలు రాష్ట్రంలో దుస్థితిని తెలియచేస్తున్నాయని చెప్పారు. పవర్ హాలిడే ప్రకటనతో పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కల్గుతుందన్నారు. 36 లక్షల మంది కార్మికుల ఉపాధికి దూరమయ్యారని పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేది.. దీంతో 2014 – 19 సమయంలో అప్పటి ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతల ప్రభావం పెద్దగా ఉండేది కాదని గుర్తు చేశారు. ఒకటి, రెండు సందర్భాలలో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు కడియం ప్రాంత రైతులు తన వద్దకు వచ్చి భారం మోయలేమంటూ గోడు వెళ్లబోసుకున్నారని తెలిపారు. తాను ప్రభుత్వం దృష్టికి ప్రజల తరఫున ఈ విషయం తీసుకెళ్లినప్పుడు పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకున్నారని చెప్పారు.

Pawan Kalyan : వాళ్లది మైండ్ గేమ్..జాగ్రత్త.. పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

వైసీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేసిందన్నారు. యూనిట్ రూ. 4.80 చొప్పున 25 ఏళ్ల పాటు గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసిందని చెప్పారు. యూనిట్ 2 రూపాయలకే గ్రీన్ ఎనర్జీని తీసుకొస్తామని చెప్పింది… ఇప్పుడేమో కోల్ ఎనర్జీని రూ.20 పెట్టి కొంటోందని పేర్కొన్నారు. ఇలాంటి లోపభూయిష్ట నిర్ణయాల వల్లే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని విమర్శించారు. ఉచితం అని చెప్పి 57 శాతం ఛార్జీలు పెంచారని విమర్శించారు.

ఫ్యాను, రెండు లైట్లు, 15 గంటలు టీవీ చూసినా 150 యూనిట్లే ఖర్చు అవుతుందని, మరో 50 యూనిట్లు పెద్ద మనసుతో అదనంగా ఇస్తున్నామని చెప్పారని తెలిపారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేశారని పేర్కొన్నారు. కరెంట్ కోతలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రిళ్లు ప్రశాంత నిద్ర లేక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లల్లో కరెంటు లేకపోవడంతో కొందరు రైల్వే స్టేషన్, బస్టాండుల్లో పడుకుంటున్నారని పేర్కొన్నారు.

Janasena: పెట్రోల్ పెంపు నిరసిస్తూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన: పవన్ కళ్యాణ్ పిలుపు

పరిశ్రమలకు ఇప్పటికే వారాంతంలో ఒక రోజంతా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని తెలిపారు. తాజాగా మరో రోజు పవర్ హాలిడే ప్రకటించడంతో పరిశ్రమలు వారానికి రెండు రోజులు మూతపడనున్నాయని చెప్పారు. అలాగే నిరంతరం పని చేసే పరిశ్రమలు ఇప్పుడు వాడుతున్న కరెంట్ లో ఇక 50 శాతం మాత్రమే వాడాలనే నిబంధన విధించిందదన్నారు. దీంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు విద్యుత్ కోతలతో నష్టాల పాలవుతున్నారని పేర్కొన్నారు. ఇక తమ సహనాన్ని పరీక్షించకండి అని అన్నారు.

వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదని స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుంచి పెరిగిన విద్యుత్ ఛార్జీల వరకు ప్రజల పక్షానే పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు రోడ్డెక్కడానికి, కౌలు రైతుల ఆత్మహత్యలకు కారణం తాము కాదు.. మీ విధానాలేనని పేర్కొన్నారు. తాము ప్రభుత్వ విధానాలు, పాలసీల గురించి మాట్లాడితే తనను వ్యక్తిగతంగా రాక్షసుడు, దుర్మార్గుడు అని దూషిస్తున్నారని తెలిపారు.

Pawan Kalyan : 2024లో మేం అధికారంలోకి వస్తాం.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చేప్రసక్తే లేదు : పవన్

వ్యక్తిగతంగా దూషణలకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసు అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడి తమ సహనాన్ని పరీక్షించ వద్దు అని తెలిపారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు నుంచి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించే వరకు, వైసీపీ అనాలోచిత విధానాలతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ప్రతి ఒక్క జన సైనికుడు, వీరమహిళ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.