Janasena: పెట్రోల్ పెంపు నిరసిస్తూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన: పవన్ కళ్యాణ్ పిలుపు

పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి గారు... ఇచ్చిన మాటను మరిచిపోయారు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Janasena: పెట్రోల్ పెంపు నిరసిస్తూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన: పవన్ కళ్యాణ్ పిలుపు

Janasena

Janasena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేసిన పవన్..విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద జనసేన కార్యకర్తలు నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి పవర్ ఇవ్వండి నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ విద్యుత్ ఛార్జీలను పెంచేసి వైసీపీ నాయకత్వం తన పవర్ ఈ విధంగా చూపించుకుందంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఉగాది కానుకగా రూ.1400 కోట్ల విద్యుత్ ఛార్జీల వడ్డింపుతోపాటు ట్రూ అప్ ఛార్జీల పేరిట మరో రూ. 3 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపారని పవన్ మండిపడ్డారు. ఆదాయం లేదు..రాబడి లేదు..ట్యాక్సులు మీద ట్యాక్సులు మాత్రం వేస్తున్నారని..చెత్త పన్ను, ఆస్తి పన్ను, ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ పై అధిక వ్యాట్, లిక్కర్ పై అయితే సరే సరే అంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పవన్.

Also read:Telangana : తెలంగాణాలో కరోనా… 26 జిల్లాల్లో సున్నా కేసులు

ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు కూడా పెంచి సామాన్యుడి వెన్ను విరిచేస్తున్నారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో రూ. 20 లాక్కుంటున్నారని.. మరి పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి గారు… ఇచ్చిన మాటను మరిచిపోయారు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న మనం..నేడు అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్నామని..గ్రామాల్లో 3 నుంచి 6 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారని పవన్ అసహనం వ్యక్తం చేశారు.

Also read:Sajjala Ramakrishna Reddy: విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణం ఆనాడు చంద్రబాబు చేసిన తప్పిదాలే: సజ్జల

జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నీటి పన్ను, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుపై బాదుడే బాదుడు అంటూ దీర్ఘాలు తీసి..”ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచితే దీనిపై ఏం మాట్లాడాలి? బాదుడే బాదుడు అనాలా? ఇంకేం అనాలో మీరే చెప్పండి” అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తెల్లారిందంటే చాలు… జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఏ పన్నులు విధిస్తుందో, ఏ ఛార్జీలు పెంచుతుందోనని ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొందని పవన్ ఆక్షేపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపడుతుందని.. జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు ఈ నిరసనలో పాల్గొని పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలంటూ ఆయా శాఖల అధికారులకు వినతిపత్రాలు అందజేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ప్రజల తరఫున పోరాటం చేస్తామని ఆయన అన్నారు.

Also read:AP BC Ministers: సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ నేతలు సమావేశం: పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన