Pawan Kalyan : ఆ కులస్తులు ముఖ్యమంత్రి కావాలి, సంపూర్ణ మద్యపాన నిషేధం అసాధ్యం- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan : బీసీల్లో నలుగురికి పదవులు ఇచ్చి వేల మందికి అన్యాయం చేస్తున్నారు. రెడ్డి, కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిని అందరూ ఆదరిస్తున్నపుడు మిగతా వారిని ఎందుకు ఆదరించడం లేదనేది అధ్యయనం జరగాలి.

Pawan Kalyan (Photo : Twitter)
Pawan Kalyan – Bhimavaram : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గౌడ, శెట్టి బలిజ సంఘాల నేతలతో సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తరహాలో ఐదు ఉపకులాలు కలిపి గౌడ కులం ఒక్కటే ఉండాలనేది నా కోరిక అన్నారు పవన్ కల్యాణ్. బీసీలం అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా అన్ని కులాల వారికి జనసేనలో అవకాశం ఇస్తున్నాం అని చెప్పారు. బీసీలకు రాజ్యాధికారం అందాలనేది నా బలమైన కోరిక అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కల్లు గీత ఎక్కువ మందికి కులవృత్తిగా ఉందని, కనుక తెలంగాణ తరహలో ప్రత్యేక ఈత వనాలు ఏర్పాటుకు కృషి చేస్తామని పవన్ తెలిపారు.
సంపూర్ణ మద్యపానం నిషేధం చేయటం సాధ్యం కాని పని అన్నారు పవన్ కల్యాణ్. రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేస్తే పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువగా బ్లాక్ మార్కెట్లో రావడం, చీప్ లిక్కర్ తయారు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. చీప్ లిక్కర్ తో ప్రజలు తమ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు అని వాపోయారు. కులాల్లో ఒకళ్లు ఎదుగుతున్నారు మరొకరు ఎదగలేదు అనే విషయంపై లోతైన అధ్యయనం జరగాలన్నారు.
”సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఇప్పటిదాకా ఎక్కడా సఫలీకృతం అయినట్లు దాఖలాలు లేదు. ఇది ఫెయిల్యూర్ లక్షణాలే తప్ప సక్సెస్ కాదు. సంపూర్ణ మద్యపాన నిషేధం వల్ల బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతుంది తప్ప ఉపయోగం లేదు. ఉన్న చట్టాలను మరింత బలోపేతం చేసే దిశగా జనసేన ప్రయత్నిస్తుంది” అని పవన్ కల్యాణ్ అన్నారు.
”ఉపకులాల మధ్య ఐక్యత లేకపోవడం సమస్యగా మారింది. బీసీల సంక్షేమానికి జనసేన కట్టుబడి ఉంటుంది. బీసీ కులాలు కచ్చితంగా అధికారంలోకి రావాలి. బీసీల్లో నలుగురికి పదవులు ఇచ్చి వేల మందికి అన్యాయం చేస్తున్నారు. పంచాయితీ స్థాయి పదవుల్లో బీసీలు ఎంత బలపడితే అంతపైకి వెళ్ళగలరు. రెడ్డి, కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిని అందరూ ఆదరిస్తున్నపుడు మిగతా వారిని ఎందుకు ఆదరించడం లేదనేది అధ్యయనం జరగాలి. గౌడ కులానికి చెందిన వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలని కూడా ఆశిస్తున్నా” అని పవన్ కల్యాణ్ అన్నారు.