Pawan Kalyan : నేటి నుంచి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర.. తొలిసారి కలిసి పాల్గొననున్న జనసేన, టీడీపీ
టీడీపీతో పొత్తు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు కూడా పవన్ కు మద్దతుగా నిలవబోతున్నారు. వారాహి యాత్రకు టీటీడీ మద్దతు ప్రకటించింది.

Pawan Kalyan Varahi Yatra
Pawan Kalyan – Varahi Yatra : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు నేటి (ఆదివారం) నుంచి కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ప్రారంభం కాబోతుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి వారాహి యాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు అవినగడ్డలోని శ్రీ అక్కటి దివాకర్ వీణా దేవి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరుగనుంది. వారాహి వాహనంపై నుంచి సభికులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.
పవన్ వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు సాగనుంది. అవనిగడ్డ బహిరంగ సభ అనంతరం మచిలీపట్నం చేరుకుని అక్టోబర్ 2, 3 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్టోబర్ 2న కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశం అవుతారు. అక్టోబర్ 3న జనవాణి కార్యక్రమంలో పాల్గొని, ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారు. అక్టోబర్ 4న పెడన, అక్టోబర్ 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు.
చేనేత కార్మికులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. చేతి వృత్తులపై ఆధార పడిన వారికి ఒక భరోసా ఇవ్వబోతున్నారు. టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత తొలిసారి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రాబోతుండటంతో వారాహి యాత్రలో పవన్ ఏం మాట్లాడబోతున్నారన్నది ఆసక్తి కలిగిస్తోంది. గత యాత్రలో వైసీపీ సర్కార్, సీఎం జగన్ ను టార్గెట్ గా చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ జనసేనాని ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తారని భావిస్తున్నారు.
ఇక మరోవైపు టీడీపీతో పొత్తు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు కూడా పవన్ కు మద్దతుగా నిలవబోతున్నారు. వారాహి యాత్రకు టీటీడీ మద్దతు ప్రకటించింది. జనసేనతో కలిసి ఇప్పటికే క్షేత్రస్థాయిలో టీడీపీ కేడర్ పని చేస్తున్నప్పటికీ వారాహి యాత్రలో మాత్రం అధికారికంగా తొలిసారి ఇరు పార్టీలు కలిసి పాల్గొనబోతున్నాయి.