Janasena Social Audit : రూ.10లక్షల భూమి రూ.కోటికి కొనుగోలు.. జగనన్న ఇళ్ల స్కీమ్ పెద్ద స్కామ్ అంటున్న జనసేన

జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తున్న జనసేన.. జగనన్న ఇళ్లపై సోషల్ ఆడిట్ చేస్తామంటోంది. దీనికోసం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయాలని నిర్ణయించింది.

Janasena Social Audit : రూ.10లక్షల భూమి రూ.కోటికి కొనుగోలు.. జగనన్న ఇళ్ల స్కీమ్ పెద్ద స్కామ్ అంటున్న జనసేన

Updated On : November 12, 2022 / 10:41 PM IST

Janasena Social Audit : కొద్దిరోజులుగా వరుస కార్యక్రమాలతో స్పీడ్ పెంచిన జనసేన.. మరో కొత్త అంశంపై పోరాటం మొదలు పెట్టింది. పథకాలపై సోషల్ ఆడిటింగ్ నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి జగనన్న ఇళ్ల పథకంపై సోషల్ ఆడిట్ చేపట్టింది. జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు అంటూ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తున్న జనసేన.. జగనన్న ఇళ్లపై సోషల్ ఆడిట్ చేస్తామంటోంది. దీనికోసం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయాలని నిర్ణయించింది.

జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలు, మౌలిక వసతుల పేరుతో వేల కోట్ల అవినీతి జరిగిందని జనసేన ఆరోపిస్తోంది. రూ.10 నుంచి రూ.20లక్షలు విలువ చేసే ఎకరా భూమిని రూ.70లక్షల నుంచి కోటి రూపాయల వరకు పెట్టి కొనుగోలు చేశారంటోంది. స్థానిక ప్రజాప్రతినిధులు కుమ్మక్కై కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని జనసేన నాయకులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం విజయనగరం వెళ్లనున్నారు. గ్రామంలో పేదలందరికీ ఇళ్ల పథకం అమలు తీరును పవన్ పరిశీలించనున్నారు. లబ్దిదారులతో పవన్ మాట్లాడతారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జగనన్న ఇళ్ల నిర్మాణం పేరుతో సీఎం జగన్ పేదలను మోసం చేస్తున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమాన్ని శనివారం నుంచి ప్రారంభించారు. కొమిడి సమీపంలోని జగనన్న ఇళ్ల నిర్మాణాలను నాయకులు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న తీరుపై లబ్దిదారులను ఆరా తీశారు. పేదలందరికి ఇళ్లు అన్నది పెద్ద స్కామ్ గా మారిందని జనసేన నాయకులు ఆరోపించారు. లక్షలాదిగా ఇళ్లు నిర్మించామని చెబుతున్న ప్రభుత్వం.. ఈ మూడేళ్లలో ఎన్ని ఇళ్లు పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడ చూసినా నాసిరకం నిర్మాణాలే కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. కనీసం మౌలిక వసతుల కల్పన అన్నది లేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఆధారాలతో బయటపెడతామన్నారు.

జగనన్న ఇళ్ల స్కీమ్ పై సోషల్ ఆడిట్ లో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగనన్న ఇళ్ల కాలనీలు, టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను జనసేన నేతలు పరిశీలించనున్నారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలోని అతి పెద్ద జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించనున్నారు. విజయనగరంతో పాటు రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో జరిగే సోషల్ ఆడిట్ కార్యక్రమంలో కూడా పవన్ కల్యాణ్ పాల్గొనబోతున్నారు. మరోవైపు ఇప్పటికే ‘జగనన్న ఇళ్లు.. పేదలకు కన్నీళ్లు’ పేరుతో జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.

ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో ఎలా అమలవుతున్నాయి? పథకాల్లో లోటుపాట్లు ఏమిటి? పథకాల విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు? తదితర అంశాలపై సోషల్ ఆడిట్ ద్వారా జనసేన సమాచారాన్ని జనసేన సేకరించనుంది. లోటుపాట్లను ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని నిలదీయడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని జనసేన నేతలు వెల్లడించారు.