రాజకీయాల్లోకి మరికొందరు కింజరాపు వారసులు.. ఒకేసారి ముగ్గురి పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్

కింజరాపు కుటుంబం నుంచి కొత్త నాయకులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారన్న..

రాజకీయాల్లోకి మరికొందరు కింజరాపు వారసులు.. ఒకేసారి ముగ్గురి పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్

Updated On : September 23, 2024 / 8:46 PM IST

Kinjarapu Family: ఏపీ రాజకీయాల్లో కింజరాపు కుటుంబం రూటే సెపరేట్. ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌లో ఆ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తమ మాటల తూటాలతో ప్రత్యర్థులను కార్నర్ చేస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత కింజరాపు ఎర్రన్నాయుడు.

టీడీపీలో నంబర్-2 స్థానంలో కొనసాగారు. ఎర్రన్నాయుడు తర్వాత రాజకీయాల్లో అడగుపెట్టారు అచ్చెన్నాయుడు. మంత్రిగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఎర్రన్నాయుడు అకాల మరణం తర్వాత వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు వరుసగా మూడుసార్లు సిక్కోలు నుంచి ఎంపీగా గెలిచారు. ఈసారి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు.

అచ్చెన్నాయుడు మరో సోదరుడు హరివరప్రసాద్ కూడా టెక్కలి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూ ఇంటర్నల్ పాలిటిక్స్ నడిపిస్తూ ఉంటారు. ఎర్రన్న కూతురు భవాని 2019లో జగన్ సునామీలో కూడా రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆమె భర్త ఆదిరెడ్డి వాసు శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. బాబాయ్ అచ్చెన్నాయుడు అబ్బాయి రామ్మోహన్‌ నాయుడు ఇద్దరు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ తమ సత్తా నిరూపించుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే బాబాయ్ అబ్బాయిలకు తోడుగా ఇప్పుడు కింజరాపు కుటుంబం నుంచి కొత్త నాయకులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారన్న టాక్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు ప్రభాకర్ మొన్నటి వరకు పొలీసు శాఖలో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ఈ మధ్యే పదవీ విరమణ చేసిన ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న టాక్ వినిపిస్తోంది.

ప్రభాకర్ మాత్రమే కాదు మరో ఇద్దరు యువ నాయకులు కింజరాపు ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అన్న రామ్మోహన్ నాయుడు బాటలో నడవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అచ్చెన్న కుమారుడు కింజరాపు కృష్ణమోహన్‌నాయుడు, హరిప్రసాద్ కొడుకు కింజరాపు సురేష్ రాజకీయాల్లోకి దిగేందుకు గ్రౌండ్ సిద్దం చేసుకుంటున్నారు.

ఇప్పటికే టెక్కలి అసెంబ్లీ, శ్రీకాకుళం పార్లమెంట్‌లో పాగా వేసిన కింజరాపు కుటుంబం ఇప్పుడు వెలమ సామాజికవర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు రచిస్తోందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే సురేష్ నాయుడు నిమ్మాడ గ్రామ సర్పంచ్ బరిలో నిల్చుని విజయం సాధించారు. ఇక ప్రభాకర్ నాయుడు, కృష్ణమోహన్ ఎలా ఏంట్రీ ఇస్తారన్న దానిపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.

వీళ్లే కాదు కింజరాపు ఫ్యామిలీకి చాలామంది రాజకీయ నేతలు బంధువులుగా ఉన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే, మంత్రి బండారు సత్యనారాయణ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు మామ అవుతారు. అతని కూతురును పెళ్లి చేసుకున్నారు రామ్మోహన్ నాయుడు. ఎర్రన్న నుంచి మొదలైన కింజరాపు ఫ్యామిలీ రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా పెరుగుతూ వస్తోంది.

ఆయన రాకపై వారందరిలోనూ అయిష్టత? బాలినేనిని ఎలా చేర్చుకుంటారంటున్న ఎమ్మెల్యే దామచర్ల!