ఆయన రాకపై వారందరిలోనూ అయిష్టత? బాలినేనిని ఎలా చేర్చుకుంటారంటున్న ఎమ్మెల్యే దామచర్ల!

జనసేనలో చేరితే భవిష్యత్‌ ఒంగోలు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనే...

ఆయన రాకపై వారందరిలోనూ అయిష్టత? బాలినేనిని ఎలా చేర్చుకుంటారంటున్న ఎమ్మెల్యే దామచర్ల!

Balineni Srinivasa Reddy

Updated On : September 23, 2024 / 8:34 PM IST

కారణమేంటో తెలియదు. అక్కడ ఉండలేకపోతున్నారో.. కేసుల భయం పట్టుకుందో కానీ వైసీపీని వీడి.. జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. ఫ్యాన్‌ పార్టీలో గౌరవం దక్కడం లేదని.. అందుకే ఆ పార్టీని వీడుతున్నానని బాలినేని జనసేన తలుపుతట్టారు.

పవన్ ఓకే చెప్పడంతో కూల్ అనుకున్నారు. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఈనెల 26న జనసేన కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు బాలినేని. కానీ ఒంగోలు టీటీడీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ మాత్రం జనసేనలో బాలినేని చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలసి ఉన్నాయి. అందుకే బాలినేని ఎలా చేర్చుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు.

ఒంగోలు నియోజకవర్గం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వైరం. ఎప్పటినుంచో బాలినేనికి వ్యతిరేకంగా పోరాడుతూ వస్తున్నారు జనార్దన్. అందుకే కూటమిలో కీలకంగా ఉన్న జనసేనలో బాలినేని చేరుతుండటం ఆయనకు నచ్చడం లేదు.

ఓపెన్‌గానే చెబుతున్న దామచర్ల
ఈ విషయాన్ని ఓపెన్‌గానే చెబుతున్నారు దామచర్ల. ఒంగోలు కూటమి నేతలు బాలినేని రాకను తీవ్రంగా వ్యతరేకిస్తున్నారు. బాలినేనిని తీసుకోవద్దంటూ చాలాసార్లు అటు సీఎంవోకు ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణకు ఫిర్యాదులు చేశారు. అయితే ఈనెల 26న జనసేన కండువా కప్పుకుంటానని బాలినేని స్వయంగా ప్రకటించడంతో..అప్పటివరకు అగ్గిమీద గుగ్గిలంగా ఉన్న టీడీపీ, జనసేన శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

దీనికి తోడు పవన్ కల్యాణ్‌ను బాలినేని కలిసివచ్చిన మరునాడే ఒంగోలులోని పలుసెంటర్లలో జనసేనలోకి బాలినేనికి స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు ఏర్పాటు చేయడం రచ్చకు దారి తీసింది. అందులో టీడీపీ, జనసేన నేతల ఫోటోలు వేయడంపై కూటమి నేతలు ఆగ్రహంతో రగిలిపోయారు. బాలినేని అనుచరులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను చింపేశారు టీడీపీ కార్యకర్తలు. ఇదే పరిస్థితుల్లో ఇబ్బందులను చక్కబెట్టుకుని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్న తర్వాత ముందుకెళ్లాల్సిందిపోయి మరోసారి ప్లెక్సీలను ఏర్పాటు చేశారు బాలినేని అనుచరులు. అందులో కేవలం బాలినేని, పవన్ కల్యాణ్, కాపునేత వంగవీటి రంగా ఫోటోలను మాత్రమే వేయడంతో సమస్య ఇంకా ముదిరింది.

ఇదే పరిస్థితుల్లో టంగుటూరు మండలం తూర్పునాయుడి పాలెంలో తన తాత దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ సభలో.. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత ఐదేళ్లలో బాలినేని అరాచకాలపై పోరాడమని..తమని ఇబ్బంది పెట్టి ..కేసుల పాలు చేసి అక్రమంగా జైలుకు పంపిన బాలినేనిని కూటమి పార్టీ అయిన జనసేనలో ఎలా తీసుకుంటారంటూ దామచర్ల ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది.

వదిలే ప్రసక్తే లేదంటున్న దామచర్ల
తనపై దాడులు చేయించి 32కేసులు పెట్టిన బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డిని..వారు ఏ పార్టీలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదంటున్నారు దామచర్ల. అక్రమాలు, భూకబ్జాల నుంచి బయట పడేందుకే బాలినేని జనసేనలోకి వస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ కూడా బాలినేనిని కాపాడలేడంటూ దామచర్ల జనార్ధన్ ఫైర్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా అవుతోంది. పార్టీలో చేరకముందే తమపై జనసేన అధినేతకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరిస్తున్నాడని మండిపడుతున్నారు ఎమ్మెల్యే దామచర్ల.

జనసేనలో బాలినేని చేరికపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. బాలినేని జగన్‌ కోవర్టుగా జనసేనలోకి వెళ్తున్నారని మండిపడుతున్నారు. పటిష్టంగా ఉన్న కూటమిలో చీలికలు తెచ్చి ఎన్నికల నాటికి జనసేనను విడదీసి వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకే బాలినేని లాంటి నేతలు జనసేలో చేరుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పవన్‌ కల్యాణ్‌కు ఈ కోవర్టు రాజకీయాల గురించి తెల్వనిది కాదు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఇలాంటి పాలిటిక్స్‌ ఎన్నో ఫేస్ చేశారు పవన్. సొంతంగా తాను పార్టీ పెట్టాక కూడా పొలిటికల్ గేమ్స్ ఎలా ఉంటాయో కూడా తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు బాలినేని ఇష్యూను పవన్ ఎలా సెటిల్‌ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దాకే బాలినేనికి కండువా కప్పుతారా లేక టీడీపీ నేతల అభ్యంతరాలను లెక్క చేయకుండా బాలినేనిని చేర్చుకుంటారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

కూటమిలో కుంపటి
ఇక ఒంగోలులో నిన్నటివరకు ఇద్దరు నేతల మధ్య వైరం కాస్త ఇప్పుడు కూటమిలో కుంపటికి దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో బాలినేని జనసేనలో చేరితే భవిష్యత్‌ ఒంగోలు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనే చర్చ సాగుతోంది. కారణాలు ఏమైనా..ఇన్నాళ్లు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. వైసీపీని వీడి జనసేన తలుపు తట్టారు. పవన్ డోర్ ఓపెన్ చేయడంతో.. హమ్మయ్య ఇక అంతా ఓకే అనుకున్నారు.

కానీ.. ఒంగోలు రాజకీయం అంత ఈజీగా లేదు. బాలినేని జంపింగ్‌పై కూటమి గొడవ ఎలా ఉన్నా.. వైసీపీ క్యాడర్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తోంది. బాలినేని కారణంగా ప్రకాశం జిల్లాలో పార్టీకి నష్టం జరిగిందని వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. ఆయన్ను మాత్రం మళ్లీ పార్టీలోకి అస్సలు తీసుకోవద్దని జగన్‌ను కోరుతున్నారు. మళ్లీ వచ్చినా ఆయన వల్ల పార్టీకి నష్టమేనన్న అభిప్రాయాలను వైసీపీ క్యాడర్ వ్యక్తం చేస్తోంది.

కర్నూలులో హైకోర్టు బెంచ్, అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజీ- సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం