కొండ్రు దారేటు? జగన్ గూటికేనా?

శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కొండ్రు మురళీమోహన్ వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో ఉంటూ వైసీపీ నిర్ణయాన్ని బలపర్చడం వెనుక జగన్ గూటికి చేరాలనే ఉద్దేశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కొండ్రు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
2004 సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొంది, తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో 2009 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపొందారు. 2012లో రాజకీయ పరిణామాల కారణంగా శంకరరావును తొలగించి కొండ్రుకు మంత్రి పదవిని కట్టబెట్టారు.
రాష్ట్ర విభజన అనంతరం శ్రీకాకుళం జిల్లాలోని 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంత కాలానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు మంతనాలతో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ప్రకటించిన తర్వాత నియోజకవర్గంపై పట్టు బిగించారు. రాజాం నియోజకవర్గంలో అప్పటికే హవా సాగిస్తున్న టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయింది. అప్పటి నుంచి ఆధిపత్య పోరు మొదలైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతే అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు.
వైసీపీ నేతలతో మంతనాలు :
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కొండ్రు… తాజాగా జగన్ మూడు రాజధానుల ప్రకటనను సమర్థిస్తూ మీడియాకు ఎక్కారు. ఈ వ్యవహారం టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదట. టీడీపీని వీడాలన్న ఆలోచనతోనే కొండ్రు మురళీ మోహన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు జనాలు అనుకుంటున్నారు.
ఇప్పటికే వైసీపీకి చెందిన ముఖ్య నేతలతో మురళీమోహన్ మంతనాలు సాగించినట్లు చెబుతున్నారు. ఆయన వైసీపీలోకి వెళ్లిపోవడం ఖాయమని అనుచరులు సైతం అంటున్నారు. ఇంత ప్రచారం సాగుతున్నా ఆయన మాత్రం ఖండిచడం లేదు. దీంతో ఆయన పార్టీ మార్పు తథ్యమని ఫిక్స్ చేసేస్తున్నారు జనాలు.