కేవైసీ కష్టాలు.. ప్రభుత్వ కార్యాలయాల్లో పడిగాపులు

అరకోటి మందికి పైగా కేవైసీ పూర్తి కాలేదు. ఇంకా మూడ్రోజుల గడువు మాత్రమే ఉంది. నమోదు కేంద్రాలు అరకొరగా ఉండటమే ప్రధాన సమస్య. ఈ-కేవైసీ పూర్తి కాకపోతే రేషన్ ఇవ్వరేమోనని భయంతో ప్రజలు రేషన్ దుకాణాలు, మీ-సేవ కేంద్రాలు, తపాలా కార్యాలయాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. పది రోజులుగా రాష్ట్రంలో కనిపిస్తున్న సమస్య ఇది.
ఆగష్టు 25లోగా ఈ-కేవైసీ చేయించుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలతో లబ్ధిదారుల్లో ఆందోళన పెరిగిపోయింది. రేషన్‌కార్డుల్లో ఇతర పేర్లు చేర్చారని, వాహనం లేకున్నా కారు నమోదైందని కేంద్రాలకు వచ్చి వాపోతున్నారు. రేషన్‌తోపాటు పాటు పలు ప్రభుత్వ పథకాల అమలుకు ప్రజాసాధికార సర్వేను ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో వేలిముద్రల నమోదు తప్పనిసరిగా మారింది.
మూడు రోజుల్లో కష్టమే..
15 రోజుల క్రితం ప్రారంభించిన కేవైసీ ఇప్పటికి ఒక్కో జిల్లాలో 1.5 లక్షల వరకే నమోదైంది. ఇంకా 3నుంచి 5 లక్షల మంది వరకూ నమోదు చేయించుకోవాల్సి ఉంది. ఆగష్టు 25లోగా పూర్తి చేయాలన్న అధికారుల ఆదేశాల ప్రకారం గడువు 3 రోజులే ఉంది. ఇంత తక్కువ సమయంలో ఆధార్, ప్రజాసాధికార సర్వే, ఈ-కేవైసీ వీరందరికీ పూర్తి చేయడం అసాధ్యమేనని అనిపిస్తోంది.
ఆధార్‌తో కలపాలంటే:
రేషన్‌కు వెళ్లినా, ఇతర పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ తప్పనిసరైంది. లబ్ధిదారుల వేలిముద్రలు సరిగా లేకపోతే వెనక్కి పంపేస్తున్నారు. గతంలో ఆధార్ మొదలైనప్పుడు ఏడెనిమిదేళ్ల వయస్సున్న పిల్లలు పాత వేలిముద్రలు మ్యాచ్ కావు. వారు కొత్తగా నమోదు చేయించుకోవాల్సిందే. 15 ఏళ్ల వయసులో వారు మరోసారి ఆధార్ కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు నమోదు చేయించుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోస్టు ఆఫీస్‌లు, మీ-సేవ కేంద్రాల్లో ఆధార్ అప్‌డేట్ చేయించుకునే వీలు కల్పించారు. ఆధార్ నమోదు కేంద్రంలో సర్వర్ పనిచేస్తే రోజుకు 20 నుంచి 25 మందికి మాత్రమే పని పూర్తి అవుతుంది. కొన్ని సెంటర్లలో ముందుగానే 10 రోజులకు సరిపడా టోకెన్లు ఇచ్చేశారు.
ప్రజాసాధికార సర్వేలో..
ప్రజాసాధికార సర్వే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది వివరాలు నమోదు చేయించుకోలేదని అంచనా. సర్వే పూర్తయినా.. ఈ-కేవైసీ లేనివారు ఇందులో 56 లక్షల మంది ఉన్నారట. సాధికార సర్వే కోసం ఇచ్చిన ట్యాబ్‌ల్లో అధికశాతం పాడయ్యాయి. మండలం మొత్తానికి ఒకరిద్దరి దగ్గరే నమోదుకు అవసరమైన పరికరాలు ఉన్నాయి. 1100 ఫోన్ నంబరుకు ఫోన్ చేస్తే సర్వే సిబ్బందిని పంపించే ఏర్పాట్లు చేస్తున్నా అది చాలని పరిస్థితి.
రేషన్‌కు కూడా అదే బాధ
కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే వారిలో ఒకరిది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి అయింది. మిగిలిన ముగ్గురూ వేలిముద్ర వేసి ఈ-కేవైసీ పూర్తి చేయించుకోలేదు. అయినా నెలనెలా రేషన్ ఇస్తున్నారు. కార్డులో పేరున్న వారంతా ఈనెల 25లోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని పౌరసరఫరాలశాఖ సూచించింది.