విజయవాడలో విషాదం.. ఇళ్లపై విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు మృతి

విజయవాడంలో విషాద ఘటన చేటు చేసుకుంది. ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద ..

విజయవాడలో విషాదం.. ఇళ్లపై విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు మృతి

Heavy rain in Vijayawada

Heavy rain in Vijayawada : ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. విజయవాడలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతుంది. దీంతో నగరంలోని రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం కారణంగా విజయవాడంలో విషాద ఘటన చేటు చేసుకుంది. ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసంకాగా.. మరో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు బండరాళ్ల కింద చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటన స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు, అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Also Read : AP Rains : అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల ప్రజలకు అలెర్ట్

కొండచరియలు విరిగిపడి ధ్వంసమైన ఇంటిలో ఐదుగురు కుటుంబ సభ్యులు ఉంటున్నారని స్థానికులు తెలిపారు. వీరిలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరు బండరాళ్ల కింద చిక్కుకుపోయారని స్థానికులు పేర్కొన్నారు. వీరంతా రోజువారి కూలీలుగా తెలుస్తోంది. గతంలోనూ పలుసార్లు చిన్నపాటి వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదని, దీంతో భారీ వర్షం కురిసిన ప్రతీసారి భయంతో జీవనం సాగించాల్సి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగేది కాదని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. పలువురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.