Tirumala : తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచారం.. నడక మార్గంలోని భక్తులకు టీటీడీ కీలక సూచనలు

తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి కదలికలు కనిపించాయి. గడచిన నెల రోజుల్లో రెండు రోజులపాటు వీటి సంచారం కనిపించింది.

Tirumala : తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచారం.. నడక మార్గంలోని భక్తులకు టీటీడీ కీలక సూచనలు

Leopard

Updated On : December 30, 2023 / 11:43 AM IST

Cheetah in Tirumala : తిరుమల వెళ్లే భక్తుల్లో మళ్లీ భయం మొదలైంది. గత రెండు నెలల క్రితం తిరుమల నడక మార్గంలో పులుల సంచారం భక్తులను ఆందోళనకు గురిచేసింది. చిరుత పులి దాడిలో ఓ చిన్నారిసైతం మృతిచెందింది. ఈ ఘటనతో మెట్లమార్గంలో తిరుమల కొండపైకి చేరుకోవాలంటేనే భక్తులు భయంతో వణికిపోయారు. దీంతో టీటీడీ, అటవీశాఖ అధికారుల బృందం బోనుల సహాయంతో చిరుతలను బంధించారు. ఆ తరువాత నడక మార్గంలో రక్షణ చర్యలు చేపట్టారు. భక్తులకు ఊత కర్రలుసైతం అందజేశారు. దీంతో మళ్లీ నెలరోజుల నుంచి భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా మెట్లమార్గంలో కొండపైకి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే, తాజాగా మరోసారి చిరుత, ఎలుగుబంటి కదలికలు కనిపించడంతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Operation Cheetah : 500 ట్రాప్ కెమెరాలు, 100మంది సిబ్బంది.. తిరుమలలో ముమ్మరంగా ఆపరేషన్‌ చిరుత

తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి కదలికలు కనిపించాయి. గడచిన నెల రోజుల్లో రెండు రోజులపాటు వీటి సంచారం కనిపించింది. ఈ మేరకు ట్రాప్ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. డిసెంబర్ నెలలో 13, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాకు చిరుత చిక్కినట్లు టీటీడీ తెలిపింది. చిరుత, ఎలుగుబంటి సంచారంతో అప్రమత్తమైన టీటీడీ భక్తులను హెచ్చరించింది. నడకమార్గంలో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులు గుంపులుగా రావాలని సూచించింది. ఈ విషయంపై టీటీడీ అధికారి మాట్లాడుతూ.. శేషాచల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో రెండు సార్లు చిరుత సంచారం కనిపించిందని, ఎలుగుబంటి సంచారం కూడా కనిపించిందని తెలిపారు. నడక మార్గానికి సమీపంలో ఎక్కడా జంతు సంచారం లేదని అన్నారు. అలిపిరి కాలిబాట మార్గంలోని 7వ మైలు నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు ఫారెస్ట్ సిబ్బంది ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తున్నారని, కాలినడకన భక్తులు ఎలాంటి ఆందోళన పడాల్సిన పనిలేదని, నిర్భయంగా తిరుమలకు రావొచ్చని పేర్కొన్నారు.

Also Read : Tirumala: అలా చేయొద్దు.. తిరుమల కొండపైకి నడక మార్గంలో ప్రయాణించే భక్తులకు టీటీడీ కీలక సూచన..

ఆగస్టు నెలల్లో నడక మార్గంలో తిరుమల కొండపైకి వెళ్తున్న క్రమంలో ఓ చిన్నారిపై చిరుత దాడిచేసి హతమార్చింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. గతంలో భక్తులకు చిరుతలు, ఇతర జంతువులు కనిపించిన ఘటనలు, దాడిచేసిన దాఖలాలు ఉన్నా.. ఓ ప్రాణం పోవడం మాత్రం అదే తొలిసారి. చిన్నారి మృతితో టీటీడీ అప్రమత్తమైంది. అటవీశాఖ అధికారుల సహాయంతో నడక మార్గంలో బోన్ లను ఏర్పాటు చేసింది. నడక మార్గంలో భక్తుల రక్షణకోసం టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. దీనికితోడు చిరుతలను బంధించేందుకు టీటీడీ చేపట్టిన ‘ఆపరేషన్ చిరుత’ సక్సెస్ అయింది. తిరుమల కాలినడక మార్గంలో అటవీ ప్రాంతంలో ఏర్పాట్లు చేసిన బోనుల్లో చిరుతలు చిక్కాయి. జూన్ 24, ఆగస్టు 14, ఆగస్టు 17, ఆగస్టు 28, సెప్టెంబర్ 6 తేదీల్లో చిరుతలు బోనులో చిక్కాయి. దీంతో మెట్లమార్గంలో తిరుమల కొండపైకి వెళ్లేవారిలో భయం తొలగింది. తాజాగా మరోసారి చిరుత, ఎలుగుబంటి కదలికలను టీటీడీ గుర్తించడంతో భక్తుల్లో ఆందోళన మళ్లీ మొదలైంది.