కరోనా టీకా తీసుకున్న వ్యక్తికి మరలా పాజిటివ్

కరోనా టీకా తీసుకున్న వ్యక్తికి మరలా పాజిటివ్

Updated On : January 29, 2021 / 8:57 PM IST

machilipatnam man tests positive : కరోనా టీకా తీసుకున్న తర్వాత..కూడా..మరలా ఆ వ్యక్తికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి తొలి విడతలో భాగంగా..కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత…కోవిడ్ టెస్టు చేశారు. రిజల్ట్స్ లో పాజిటివ్ వచ్చింది. తీవ్ర ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వారు పరీక్షలు చేయించుకున్నారు. దాదాపు 8 మందికి కోవిడ్ ఉన్నట్లు నిర్ధారించారు వైద్యులు. టీకా తీసుకున్న తర్వాత..కూడా..మరలా పాజిటివ్ రావడం పట్ల వ్యాక్సిన్ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ..చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు దేశంలోని మెజార్టీ ప్రజలు మొగ్గు చూపడం లేదనే విషయం సర్వేలో వెల్లడైంది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రస్తుతం 60 శాతం మంది విముఖత చూపుతున్నారని, వ్యాక్సిన్‌ తీసుకునేందుకు విముఖత చూపుతున్న వారి సంఖ్య గత 3 వారాల్లో 69 శాతం నుంచి 60 శాతానికి తగ్గిందని లోకల్‌సర్కిల్స్‌ చేపట్టిన సర్వేలో తేలింది.

వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌పై స్పష్టత కొరవడటమే వ్యాక్సిన్‌ పట్ల భయానికి ప్రధాన కారణమని సర్వే తెలిపింది. వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎలా ఉంటాయనేది తెలియకపోవడంతోనే తాము వ్యాక్సిన్‌ తీసుకునేందుకు సిద్ధంగా లేమని సర్వేలో పాల్గొన్నవారిలో 59 శాతం మంది తెలిపారు. వ్యాక్సిన్‌ సామర్థ్యంపై అనిశ్చితితో తాము వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటామని 14 శాతం మంది వెల్లడించారు. కొవిడ్‌-19 ఏ క్షణంలోనైనా దూరమవుతుందని వ్యాక్సిన్‌ అవసరం లేదని 4 శాతం మంది చెప్పగా, ఇక కొత్తరకం కరోనా వైరస్‌లను ప్రస్తుత వ్యాక్సిన్లు అడ్డుకోలేవని మరో 4 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే తెలిపింది.