ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడి అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
కొరిమి వెంకటరమణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వెంకటరమణపై 295, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన మరువకముందే, విజయవాడ కనకదుర్గ ఆలయంలోని వెండి రథంలో మూడు సింహాలు మాయం కావడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
ఏలేశ్వరం మండలంలోని శివాలయం సమీపంలో శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.
ఆంజనేయ స్వామి విగ్రహం చేతి భాగాన్ని ధ్వంసం చేయడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు హిందూ సంఘాలు కూడా మండి పడుతున్నాయి. విగ్రహ ధ్వంసం నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు నిఘా ఉంచారు.
ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అనేదానిపై దర్యాప్తు జరిపిన పోలీసులు కొరిమి వెంటకరమణ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.