ప్రాణం తీసిన ఆస్తి తగాదాలు : వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన అన్న కొడుకులు

ప్రాణం తీసిన ఆస్తి తగాదాలు : వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన అన్న కొడుకులు

Updated On : December 20, 2020 / 12:31 PM IST

Man brutally murdered in Guntur : గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో తెల్లవారుజామున దారుణ హత్య కలకలం రేపింది. చందు కృష్ణమూర్తి(55) అనే వ్యక్తిని బంధువులే కర్రలతో కొట్టి చంపారు. కృష్ణమూర్తి పొలానికి వెళ్తుండగా దారికాచి హతమార్చారు. కర్రలతో తీవ్రంగా కొట్టడంతో కృష్ణమూర్తి అక్కడికక్కడే చనిపోయాడు.

కృష్ణమూర్తి బంధువులైన సాయి, మురళినే హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ హత్య బుర్రిపాలెంలో సంచలనంగా మారింది. కృష్ణమూర్తి బంధువులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి తరలి రావడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో ఘర్షణ చెలరేగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.

మరోవైపు ఆస్తి తగాదాలతోనే కృష్ణమూర్తిని చంపేశారని ఆయన కుమారుడు నాగరాజు ఆరోపించాడు. ఏళ్ల తరబడిగా బంధువులతో పొలం విషయంలో గొడవలున్నట్లు చెప్పాడు. కృష్ణమూర్తిని చంపేసిన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

అన్న కొడుకులే హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని… వారి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.