Chiranjeevi : రాజకీయాల్లోకి రీఎంట్రీపై.. చిరంజీవి సంచలన ప్రకటన
తన లక్ష్యాలు, సేవాభావాన్ని సాధించడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు'' అని చిరంజీవి చెప్పారు.

Chiranjeevi : బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి తన పొలిటికల్ రీఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు. సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ కళామతల్లి సేవలోనే మరిన్ని మంచి సినిమాలు చేస్తానని చెప్పారు. అలా.. తన పొలిటికల్ రీఎంట్రీపై వస్తున్న రూమర్స్ కు ఆయన చెక్ చెప్పారు.
”చాలామందికి డౌట్స్ వస్తున్నాయి.. పెద్ద పెద్ద వాళ్లకు దగ్గరవుతున్నాడు.. అటు వైపు వెళ్తాడా అని… అటువంటి డౌట్ వద్దు.. నా లక్ష్యాలు, సేవాభావాన్ని సాధించడానికి పవన్ కల్యాణ్ ఉన్నాడు” అని చిరంజీవి చెప్పారు.
”ఈ జన్మంతా ఇక రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ అక్కున చేర్చుకుంటూ ఆ కళామ ల్లితోనే ఉంటాను. చాలా మందికి డౌట్లు వస్తున్నాయి. ఏంటి అటు వెళ్తాడా, పెద్ద పెద్ద వాళ్లందరికీ దగ్గర అవుతున్నాడు. వాళ్లందరూ దగ్గరికి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా.. అంటే కాదు.. మరో రకంగా సేవలు అందించడం కోసమే తప్ప.. అంతకుమించి పొలిటికల్ గా వెళ్లటం లేదు.
ఆ డౌట్ ఎవరూ పెట్టుకోవద్దు. పొలిటికల్ గా వద్దు. పొలిటికల్ గా ముందుకు వెళ్లడానికి, నేను అనుకున్న లక్ష్యాలను, నేను అనుకున్న సేవా భావాలను, ఆ సేవలను చేయడానికి పవన్ కల్యాణ్ ఉన్నాడు” అని చిరంజీవి సెన్సేషనల్ స్టేట్ మెంట్ ఇచ్చేశారు.
చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై ఈ మధ్య కాలంలో అనేక ఊహాగానాలు వినిపించాయి. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారని ఆ పార్టీలో చేరతారని ఒకసారి, ఈ పార్టీలో చేరతారని మరొకసారి ప్రచారం జరిగింది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడులకు చిరంజీవి సైతం హాజరయ్యారు.
ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పక్కనే చిరంజీవి కనిపించారు. ఆ వేడుకల్లో ఆయన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రధాని మోదీ ఎంతో ఆపాయ్యంగా చిరంజీవిని పలకరించారు. తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. చాలా ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై జోరుగా ప్రచారం నడిచింది. చిరు బీజేపీలో చేరనున్నారని రూమర్స్ వచ్చాయి.
గతంలో చిరంజీవికి కేంద్రం పద్మ అవార్డు ప్రకటించిన సమయంలోనూ ఇలాంటి ప్రచారమే జరిగింది. అప్పుడు కూడా చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఖాయం అంటూ జోరుగానే ప్రచారం జరిగింది. చిరంజీవిని దగ్గర చేసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. త్వరలోనే చిరంజీవి బీజేపీలో చేరతారని రూమర్స్ వినిపించాయి.
ప్రజారాజ్యం పార్టీ పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకముందే.. కాంగ్రెస్‌లో విలీనం చేసి..రాష్ట్ర విభజన తర్వాత నో పాలిటిక్స్ అనేశారు మాస్టారు. కానీ గత రెండు మూడేళ్లుగా ఆయన మళ్లీ పాలిటిక్స్ వైపు అట్రాక్ట్ అవుతున్నారన్న టాక్ వినిపించింది.
దేశ ప్రధాని మోదీతో పాటు, పలువురు రాజకీయ ప్రముఖులతో చిరు సన్నిహితంగా ఉంటడం ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. ఇక, రీసెంట్ గా లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి నోట ప్రజారాజ్యం పార్టీ మాట వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజుల తర్వాత ఆయన ప్రజారాజ్యం గురించి ప్రస్తావించారు. అంతేకాదు.. నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన అంటూ కామెంట్ చేసి చర్చకు దారితీశారు.
కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవిని.. మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని రూమర్స్ వచ్చాయి. చిరు సేవలను వాడుకోవాలని బీజేపీ చూసిందట. ఢిల్లీలో కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్నారు చిరు. అయితే అందరిలో ఒకడిలా కాకుండా..చిరుకు ప్రత్యేక గౌరవం దక్కడంపైనే ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది. చిరంజీవిని రాజ్యసభకు బీజేపీ పంపబోతుందన్న టాక్ వినిపించింది.
Also Read : లిక్కర్, స్యాండ్, మైనింగ్‌పై దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు ఇలా అక్రమాల చిట్టా బయటికి వస్తుందా?
బీజేపీ లేదా జనసేన నుంచి చిరు రాజ్యసభకు వెళ్తారా? పొలిటికల్ స్క్రీన్‌పై మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారా అన్న డిస్కషన్ జోరుగా నడుస్తున్న ఈ సమయంలోనే.. ఇక ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ చిరంజీవి సంచలన స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఆ ఒక్క మాటతో చిరు పొలిటికల్ రీ ఎంట్రీ గురించి జరుగుతున్న అన్ని రకాల ప్రచారాలకు, అనుమానాలకు, సందేహాలకు ఫుల్ స్టాప్ పడినట్లైంది.