Rain Alert: ద్రోణి ప్రభావంతో దంచి కొట్టనున్న వర్షాలు.. అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాల హెచ్చరిక!
బంగాళాఖాతంల్లో ఏర్పడిన తీవ్ర ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి (Rain Alert)ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Meteorological Department issued heavy rains alert for Andhra Pradesh and Telangana.
Rain Alert: బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తులో ఒక ఆవర్తనం, తమిళనాడు-కోస్తాంధ్ర తీరంలో మరో ఆవర్తనం విస్తరించి ఉండటంతో పాటు తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో ఏపీ వెదర్ అలర్ట్ – ఈదురుగాలుల తీవ్రత:
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rain Alert) లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు, ప్రజలను అప్రమత్తం చేస్తూ గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలో నేడు వర్షాలు – రైతులకు వాతావరణ శాఖ హెచ్చరికలు:
తెలంగాణలో ఇవాళ పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే బుధ, గురువారాల్లో వర్ష ప్రభావం తగ్గి ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడనుంది. వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే కోతకు వచ్చిన పంటలు దెబ్బతినకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
