Ambati Rambabu : ఎంతమంది కలిసొచ్చినా మళ్లీ జగనే సీఎం, చంద్రబాబు చేసిన పాపాన్ని మేం మోస్తున్నాం- మంత్రి అంబటి రాంబాబు

టీడీపీ, జనసేన పార్టీలది అపవిత్ర కలయిక. తెలంగాణలో ఎందుకు కలిసి పోటీ చేయలేదు? ఏపీలో ఎందుకు కలిసి పోటీ చేస్తున్నారో సమాధానం చెప్పి ప్రజలను ఓటడగాలి.

Ambati Rambabu : ఎంతమంది కలిసొచ్చినా మళ్లీ జగనే సీఎం, చంద్రబాబు చేసిన పాపాన్ని మేం మోస్తున్నాం- మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu Slams Chandrababau Naidu (Photo : Google)

Updated On : December 10, 2023 / 7:40 PM IST

ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. తుపాను బాధితులను ఆదుకునే విషయంలో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. ప్రతీ సంక్షోభాన్ని అవకాశంగా చేసుకుని రాజకీయం చేయడం చంద్రబాబుకి అలవాటు అన్నారు. నీచమైన ఆలోచనలతో సీఎం జగన్ పై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు.

బురదలో పొర్లాడాలా..?
”మిగ్ జాం తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. తుఫాన్ కారణంగా కోతకు వచ్చిన పంటలకు తీవ్ర నష్టం కలిగింది. వాతావరణశాఖ చెప్పిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యలతోనే ప్రాణనష్టాన్ని నివారించగలిగాం. నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వం పనిచేస్తోంది. చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా విపరీతమైన బురదజల్లుతోంది. తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు వెళితే బురదలో పొర్లాడాలా..? చంద్రబాబు ఏమైనా ఒంటినిండా బురద రాసుకున్నాడా? పొర్లాడాడా? చంద్రబాబులా షో చేయడం జగన్ కి తెలియదు.

Also Read : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేసిన హెచ్చరిక ఏంటి?

తెలుగుదేశం అలసత్వం వల్లే గుండ్లకమ్మకు ఈ దుస్థితి..
రైతుల కోసం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబుకి సవాల్ చేస్తున్నా. తుఫాన్ లు వచ్చిన సమయంలో మీరిచ్చిన దానికంటే జగన్ ఎక్కువగానే పరిహారం అందించారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రైతులకు వచ్చిన కష్టాన్ని తీర్చాలని పని చేస్తున్న వ్యక్తి జగన్. ఈ రాష్ట్రంలో కొత్తవి కట్టింది, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసింది వైఎస్సార్. వైఎస్సార్ ప్రారంభించిన వాటిని పూర్తి చేయాలని భావిస్తున్న వ్యక్తి జగన్. అవుకు టన్నెల్ ను పూర్తి చేసింది జగన్. వెలిగొండ టన్నెల్ పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. తెలుగుదేశం అలసత్వం వల్లే గుండ్లకమ్మకు ఈ దుస్థితి. అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని ఆలోచించాలి.

టీడీపీ పాపాన్ని మేం మోయాల్సి వస్తోంది..
టీడీపీ సమయంలోనే గుండ్లకమ్మ రిపేర్లు చేయాలని డ్యామ్ సేఫ్టీ సూచించింది. 5 కోట్లు ఖర్చు చేసి తూతూమంత్రం చర్యలు చేపట్టి వదిలేశారు. 5 కోట్లతో ఆరోజే సక్రమంగా రిపేర్లు చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. యుద్ధప్రాతిపదికన స్టాపేజ్ పెట్టి నీటిని నిల్వ చేస్తున్నాం. గుండ్లకమ్మ విషయంలో టీడీపీ చేసిన పాపాన్ని మేం మోయాల్సి వస్తోంది. ఎగువ కాఫర్ డ్యామ్ లో గ్యాప్ ల వల్ల పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది.

చంద్రబాబు, లోకేశ్, పవన్ కు ఇల్లు లేదు, అడ్రస్ లేదు..
చంద్రబాబు, లోకేశ్, పవన్ కు ఇక్కడ ఇల్లు, అడ్రస్ లేదు. ఇక్కడకొచ్చి రాజకీయం చేసి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్తారు. చంద్రబాబు చేతిలో పసుపు జెండా లేదు. ఎవరికి కావాలంటే వారి చేతిలో పసుపు జెండా ఉంది. తెలంగాణలో 8 చోట్ల పోటీ చేస్తే జనసేనకు ఒక్కచోట మాత్రమే డిపాజిట్లు వచ్చాయి. మిగిలిన చోట్ల బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. తన మీటింగ్ లకు జనం వస్తారు కానీ ఓట్లు వేయరని పవన్ వాస్తవం గ్రహించాడు. తెలంగాణలో అదే జరిగింది.

Also Read : టీడీపీ-జనసేనకు వైసీపీ చెక్..! కాపులను తమవైపు తిప్పుకునేలా వ్యూహం..!

తెలంగాణలో ఎందుకు కలిసి పోటీ చేయలేదు?
ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రధానమైన క్యాన్సర్ గడ్డ. ఇప్పుడు తెలుగుదేశం పక్కన జనసేన క్యాన్సర్ గడ్డ వచ్చి చేరుతుంది. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా, పోయినా మాకు ఎలాంటి ఇంట్రస్ట్ లేదు. తెలంగాణలో మా పార్టీ లేదు. ఏపీలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. టీడీపీ, జనసేన పార్టీలది అపవిత్ర కలయిక. తెలంగాణలో ఎందుకు కలిసి పోటీ చేయలేదు? ఏపీలో ఎందుకు కలిసి పోటీ చేస్తున్నారో సమాధానం చెప్పి ప్రజలను ఓటడగాలి. ఎంతమంది కలిసొచ్చినా మళ్లీ జగనే సీఎం
” అని తేల్చి చెప్పారు మంత్రి అంబటి రాంబాబు.