చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లో కాపురం.. ఏపీపై పెత్తనం చేస్తున్నారు

  • Published By: vamsi ,Published On : October 24, 2020 / 01:02 AM IST
చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లో కాపురం.. ఏపీపై పెత్తనం చేస్తున్నారు

Updated On : October 24, 2020 / 7:13 AM IST

నిత్యావసర సరుకుల ధరలపై వైఎస్ జగన్ సమీక్ష జరిపారని, వర్షాలు, వరదలు పేరు చెప్పి కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు వస్తువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు వెల్లడించారు.



దుకాణాల వద్ద తప్పనిసరిగా ధరల బోర్డులు పెట్టాలని, అలా పెడుతున్నారా లేదా అన్నది కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించాలని వారికి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇక ఇదే సమయంలో చంద్రబాబు, లోకేష్ చెబితే ఇక్కడ పాలన జరగట్లేదని అన్నారు. వారి చేత చెప్పించుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు. రాష్ట్రంలో ఇంకా వారి ప్రభుత్వమే నడుస్తున్నట్లు ఫీల్ అవుతున్నారా;? అంటూ ఎద్దేవా చేశారు.



లోకేష్, చంద్రబాబు కనబడుటట్లేదని బోర్డ్ పెట్టే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉందని, తండ్రీ కొడుకులు హైదరాబాద్‌లో కాపురం చేస్తూ.. ఏపీపై పెత్తనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 నెలలుగా కనిపించకుండా పోయిన తండ్రీకొడుకుల్లో ఇప్పుడు లోకేష్ వచ్చి కొత్త బిచ్చగాడు మాదిరిగా హడావుడి చేస్తున్నాడని, లోకేష్‌కు చంద్రబాబు కొడుకు అన్న హోదా తప్ప ఏముంది..? అని ప్రశ్నించారు.



లోకేష్ చెప్తే వాళ్ళ కార్యకర్తలే వినరు. అలాంటిది లోకేష్ చెప్తే సీఎం సమీక్ష చేస్తారా?. ఇది జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం. బాధ్యతల గురించి, బాధ్యత లేని వాళ్ళు చెబితే వింటానికి కూడా బాగోదు. బహుశా లోకేష్ మొదటిసారి వరద ప్రాంతాల్లో పర్యటిస్తునట్లున్నాడు. ఇంతకుముందే చెప్పాం, వర్షాలకు, వరదకు తేడా తెలుసుకుని మాట్లాడు అని, ఏదైనా మాట్లాడితే వాటి మీద అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి అని అన్నారు.