అసెంబ్లీలో ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారంపై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ఈసారి నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయింపు ఉంటుందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారంపై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

Minister Payyavula Keshav : రేపు (జూన్ 21) ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఉంటుందని ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ముందుగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ తర్వాత పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు. మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణస్వీకారం చేస్తారని చిట్ చాట్ లో తెలిపారు మంత్రి పయ్యావుల కేశవ్.

జగన్ సాధారణ సభ్యుడిలానే బయటి నుంచి వస్తారని, అసెంబ్లీలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారమే సభ్యుల సీటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. వైసీపీ సభ్యులు అందరూ ఒకేచోట కూర్చుంటారని, అయితే అది ఎక్కడ అనేది సీట్ల కేటాయింపులోనే జరుగుతుందని తెలిపారు. ఈసారి నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయింపు ఉంటుందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా సభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఇదే ప్రధాన ఎజెండాగా ఉండనుంది. ఎల్లుండి స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ప్రొటెం స్పీకర్ గా రేపు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరిస్తారు. ఆయన 174 మంది సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ముందుగా ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తారు. మహిళా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఉంటుంది. స్పీకర్ ఎన్నిక తర్వాత సీట్ల కేటాయింపుపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.

రేపు స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఎంపిక చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఇక డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులకు ఎవరిని ఎంపిక చేయాలి అనేదానిపై తర్జనభర్జన జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాల్లో అందరు ఎమ్మెల్యేలలానే జగన్ మోహన్ రెడ్డి కూడా వ్యవహరించాల్సి ఉంటుందని మంత్రి పయ్యావుల కేశవ్ తేల్చి చెప్పారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా, ప్రధాన ప్రతిపక్ష నేతగా లేనందున జగన్ సైతం ఒక రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగానే, అందరు ఎమ్మెల్యేల మాదిరే ఆయన కూడా ప్రమాణస్వీకారం ఉంటుందని, ఆయన కూడా బయటి నుంచి నడుచుకుని రావాల్సిందేనని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

సీట్ల కేటాయింపు విషయానికి వస్తే.. సభకు కుడివైపున సీఎం కూర్చుంటారు. ఎడమవైపు ప్రధాన ప్రతిపక్షం కూర్చుంటుంది. సభ అంతా కనిపించే విధంగా ఉన్న ఓ సీటుని ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇస్తారు. అయితే, ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదా లేనందున ఆ సీటుని ఎవరికి కేటాయిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read : కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దాం, మరోసారి పాదయాత్ర ఉంటుంది- జగన్ కీలక వ్యాఖ్యలు