AP Annual Budget: ఏపీ బడ్జెట్‌లో ఉచిత విద్యుత్‌పై కీలక అప్‌డేట్‌.. ఆదరణ పథకం, మత్స్యకార భరోసాకు నిధులు కేటాయింపులు ఇలా..

ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు.

AP Annual Budget: ఏపీ బడ్జెట్‌లో ఉచిత విద్యుత్‌పై కీలక అప్‌డేట్‌.. ఆదరణ పథకం, మత్స్యకార భరోసాకు నిధులు కేటాయింపులు ఇలా..

Payyavula Keshav

Updated On : February 28, 2025 / 11:58 AM IST

AP Annual Budget: ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే, ఈ బడ్జెట్ లో సంక్షేమ రంగానికి పయ్యావుల ప్రాధాన్యతనిచ్చారు. మరోవైపు ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్ లో రూ. 6,705 కోట్లు కేటాయించారు.

 

సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. అన్నదాత సుఖీభవ పథకంకోసం బడ్జెట్ లో రూ.6,300 కోట్లను కేటాయించారు.

తల్లికి వందనం కోసం రూ. 9,407 కోట్లు ( ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు) కేటాయించారు. 1 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు ఈ స్కీం వర్తిస్తుంది. స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది.

ఎటువంటి జాప్యం లేకుండా.. కార్పోరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్ లో పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఈ ఏడాదిలోనే రూ. 25లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు బడ్జెట్ లో వెల్లడించారు.

ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తుంది. ఇందుకోసం రూ.400 కోట్లు కేటాయించింది. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్లు, మర మగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్లు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం  బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించారు.

టిడ్కో ద్వారా 2లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్ లో పయ్యావుల కేశవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా రూ.50వేలు, ఎస్టీలకు అదనంగా రూ.75వేలు ఇవ్వనున్నట్లు బడ్జెట్ లో వెల్లడించారు.

ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యమైన దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మొదలైన విషయం తెలిసిందే. గతేడాది నుంచి గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభమైంది. బడ్జెట్ లో ఈ పథకానికి రూ. 2,601 కోట్లు కేటాయించారు.

చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు ప్రభుత్వం పెంచిన విషయ తెలిసిందే. బడ్జెట్ లో మత్స్యకార భరోసా పథకానికి రూ. 450 కోట్లు కేటాయించారు.

ఆదరణ పథకంను కూటమి ప్రభుత్వం పునః ప్రారంభించింది. కులవృత్తులను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆదరణ పథకాన్ని మళ్లీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకానికి తాజాగా బడ్జెట్ లో రూ. వెయ్యి కోట్లు కేటాయించారు.