తెలంగాణలో కేటీఆర్, ధర్మవరంలో కేతిరెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారు- ఏపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో కేటీఆర్ ధరణి పేరుతో భూ మాఫియాకు తెరలేపినట్లే.. ధర్మవరంలో కేతిరెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు.

తెలంగాణలో కేటీఆర్, ధర్మవరంలో కేతిరెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారు- ఏపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

Minister Satya Kumar : ధర్మవరంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓటమి తనను ఆశ్చర్యపరిచింది అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ నిత్యం ప్రజల్లో తిరిగిన కేతిరెడ్డి ఓడిపోవడం తనను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసిందని కేటీఆర్ అన్న సంగతి తెలిసిందే. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. ఆయనకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.

గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి ప్రజలకు సేవ చేయలేదని, భూకజ్జాలకు పాల్పడ్డారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో చూశారని అన్నారు. తెలంగాణలో కేటీఆర్ ధరణి పేరుతో భూ మాఫియాకు తెరలేపినట్లే.. ధర్మవరంలో కేతిరెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. చివరికి చెరువులను కూడా వదల్లేదన్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా కేటీఆర్ తీరు ఉందని మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. కేతిరెడ్డి ప్రజల్లోకి వెళ్లింది వారి సమస్యలు తీర్చడానికి కాదని, పీడించడానికి అని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు.

”ధరణి పేరుతో కేటీఆర్ తెలంగాణలో భూ మాఫియాకు తెరలేపారు. అదే విధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సందులు, గొందులు తిరిగి భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములు, ప్రజల ఆస్తులను ఆక్రమించుకున్నారు. చివరికి చెరువులను, కొండలను కూడా కేతిరెడ్డి కబళించిన విషయం కేటీఆర్ కు తెలిసినట్లు లేదు. మీ మిత్రులను బట్టి మీరు ఎటువంటి వారో అర్థమవుతుంది.

దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా కేటీఆర్ తీరు ఉంది. తెలంగాణలో కేటీఆర్ ఏపీలో జగన్ మోహన్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి.. వీరంతా కలిసి భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజా కంటకులుగా మారారు. ధర్మవరంలో కేతిరెడ్డి గురించి ఎవరిని అడిగినా చెబుతారు. ఓటమి తర్వాత.. ప్రజల్లోకి వెళ్లాము, మంచి చేశాము అని కబుర్లు చెబుతున్నారు. కేతిరెడ్డి ప్రజల్లోకి వెళ్లిన మాట వాస్తవం కావొచ్చు. కానీ దేనికోసం వెళ్లారు? ప్రజలకు మంచి చేయడానికా? పీడించడానికా? అన్నది ముందుగా కేటీఆర్ తెలుసుకోవాలి” అని మంత్రి సత్యకుమార్ హితవు పలికారు.

”రాష్ట్ర జీడీపీ పెరగలేదు, మీ కుటుంబ జీడీపీ పెరిగిందని నేను ట్విట్టర్ లో పోస్టు చేశాను. దీనికి కేటీఆర్ నన్ను బ్లాక్ చేశారు. దీన్ని బట్టి మీరు ఎంత అహంకారో అర్థమవుతుంది. మీకు మీరు సమర్థించుకోవడం చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏపీలో ప్రజల, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ప్రభుత్వం వచ్చింది” అని కేటీఆర్ ను ఉద్దేశించి ఘాటుగా బదులిచ్చారు మంత్రి సత్యకుమార్.

Also Read : సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ జగనేనా? వైసీపీని దెబ్బతీయడమే లక్ష్యమా?